heavy rocket
-
స్టార్‌షిప్ ప్రయోగం పాక్షికంగా విజయవంతం
టెక్సాస్: చంద్రుడితోపాటు అంగారక గ్రహంపై భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘స్టార్‌షిప్’ రాకెట్‌కు సంబంధించిన ఆరో ప్రయోగాన్ని మంగళవారం టెక్సాస్‌లో నిర్వహించారు. ఇందులో ఒక దశ విఫలం కాగా, మరో దశ విజయవంతమైంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తోపాటు స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించారు. దాదాపు 400 అడుగుల(121 మీటర్లు) పొడవైన స్టార్‌షిప్ రాకెట్‌ను స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పేస్ఎక్స్ లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించారు. ఇందులోని 33 శక్తివంతమైన రాప్టర్ ఇంజన్లను మండించడంతో స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ నుంచి సూపర్ హెవీ బూస్టర్ విజయవంతంగా విడిపోయింది. భూమివైపు తిరుగు ప్రయాణం ఆరంభించింది. Booster 13 splashdown in the Gulf of Mexico. Tower was go, but booster was not. pic.twitter.com/RwhZDxPaQU— Chris Bergin - NSF (@NASASpaceflight) November 19, 2024షెడ్యూల్ ప్రకారం మళ్లీ లాంచ్సైట్ వద్దకే చేరుకోవాలి. అక్కడున్న మర చేతులు బూస్టర్‌ను జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాలి. కానీ, ఇంతలో సాంకేతిక సమస్య ఎదురుకావడంతో బూస్టర్ క్యాచింగ్ ప్రక్రియను నిలిపివేశారు. బూస్టర్‌ను నింగిలోనే దారి మళ్లించారు. దాంతో అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కూలిపోయింది. ఖాళీగా ఉన్న స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే 90 నిమిషాలపాటు భూమిచుట్టూ చక్కర్లుకొట్టింది. Starship preparing to splash down in the Indian Ocean pic.twitter.com/EN9jibr07l— SpaceX (@SpaceX) November 19, 2024చివరకు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. స్టార్‌షిప్ రాకెట్ప్రయోగ దృశ్యాలను స్పేస్ ఎక్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గత నెలలో చేపట్టిన స్టార్‌షిప్ ఐదో ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. లాంచ్ సైట్ వద్దకు బూస్టర్ క్షేమంగా తిరిగొచ్చింది. మర చేతులు దాన్ని జాగ్రత్తగా అందుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా స్పేస్ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. -
సూర్యుడిపై ప్రయోగానికి నాసా సిద్ధం
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం మరి కొద్ది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు గాను ‘పార్కర్ సోలార్ ప్రోబ్’అంతరిక్ష నౌకను వచ్చే నెల 6వ తేదీలోపు ప్రయోగించేందుకు నాసా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటివరకు ఎవరూ చేపట్టని ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు నాసా కృషి చేస్తోంది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ డెల్టా–4 హెవీ లాంచింగ్ వెహికల్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా ప్రవేశించని సూర్యుడి కరోనా కక్ష్యలో ఈ నౌక పరిభ్రమించనుంది. ఆ ప్రాంతంలో ఉండే వేడి, రేడియేషన్‌ను తట్టుకుని సౌర గాలులు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాన్ని కనుగొననుంది. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పడంతో వృత్తాకారంగా కనిపించే సూర్యుడి రూపమే ఈ కరోనా. మరో విధంగా చెప్పాలంటే సూర్యుడి బాహ్యవలయం. ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు కొత్త ప్రయోగం ద్వారా ఈ కరోనా ప్రాంతంలో సమాధానాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
నేడు నింగిలోకి ఇస్రో ‘బాహుబలి’
► ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్ ► షార్ నుంచి ప్రయోగం.. శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 రాకెట్ నేడు నింగిలోకి దూసుకుపోనుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా∙శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని సోమవారం సాయంత్రం 5.28 గంటలకు ప్రయోగించనున్నారు. దీని ద్వారా జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మార్క్–3డీ1 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ను ఆదివారం సాయంత్రం 3.58 గంటలకు ప్రారంభించారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది.కౌంట్‌డౌన్ ప్రారంభించాక రెండోదశ(ఎల్–110)లో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే పని ఆదివారం రాత్రికి పూర్తి చేశారు. సోమవారం ఉదయం రాకెట్లో హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపడతారు. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయోగమిలా.. జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 పొడవు 43.43 మీటర్లు. బరువు 640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్–200)ను మండించటంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమవుతుంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్–110) మండించి రాకెట్ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తవుతుంది. 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు. తిరుమలలోఇస్రో పూజలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ పీజీ దివాకర్, డైరెక్టర్లు జయరామన్, ఎస్కే కనుంగో, సేతురామన్.. నమూనా రాకెట్‌తో పూజలు నిర్వహించారు. జీశాట్–19తో ఉపయోగాలివీ.. జీశాట్–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఇంటర్నెట్ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉపగ్రహంలో కేయూ బాండ్ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్ స్పెక్ట్రోమీటర్ పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్ బరువు 1,394 కిలోలు. జీశాట్–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది.