నేడు నింగిలోకి ఇస్రో ‘బాహుబలి’ | ISRO all set to launch India's heaviest rocket | Sakshi
Sakshi News home page

నేడు నింగిలోకి ఇస్రో ‘బాహుబలి’

Published Mon, Jun 5 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

నేడు నింగిలోకి ఇస్రో ‘బాహుబలి’

నేడు నింగిలోకి ఇస్రో ‘బాహుబలి’

► ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన రాకెట్‌
► షార్‌ నుంచి ప్రయోగం..


శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1 రాకెట్‌ నేడు నింగిలోకి దూసుకుపోనుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా∙శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని సోమవారం సాయంత్రం 5.28 గంటలకు ప్రయోగించనున్నారు.

దీని ద్వారా జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మార్క్‌–3డీ1 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ను ఆదివారం సాయంత్రం 3.58 గంటలకు ప్రారంభించారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగనుంది.కౌంట్‌డౌన్‌ ప్రారంభించాక రెండోదశ(ఎల్‌–110)లో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే పని ఆదివారం రాత్రికి పూర్తి చేశారు. సోమవారం ఉదయం రాకెట్‌లో హీలియం, నైట్రోజన్‌ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను  చేపడతారు. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో  భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రయోగమిలా.. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3డీ1  పొడవు 43.43 మీటర్లు.  బరువు  640 టన్నులు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని 16.20 నిమిషాల్లో పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు సంకల్పించారు. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే మొదటిదశలో రెండు వైపులున్న 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్ల(ఎస్‌–200)ను మండించటంతో రాకెట్‌ ప్రయాణం ప్రారంభమవుతుంది. తర్వాత 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని (ఎల్‌–110) మండించి రాకెట్‌ ప్రయాణ స్పీడ్‌ను పెంచుతారు. 2.20 నిమిషాలకు ఎస్‌–200 రెండు బూస్టర్లు విడిపోయి మొదటిదశను పూర్తి చేస్తాయి. 5.20 నిమిషాలకు రెండో దశ పూర్తవుతుంది.

25 టన్నుల క్రయోజనిక్‌ ఇంధనంతో మూడోదశను ప్రారంభించి 16.20 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,136 కిలోల బరువైన జీశాట్‌–19 సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా(పెరిజీ) 170 కి.మీ. భూమికి దూరంగా(అపోజి) 35,975 కి.మీ. ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత బెంగళూరు హసన్‌లోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని.. ఉపగ్రహంలో నింపిన అపోజీ మోటార్లను మండించి భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు.

తిరుమలలోఇస్రో పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఇస్రో సైంటిఫిక్‌ సెక్రటరీ పీజీ దివాకర్, డైరెక్టర్లు జయరామన్, ఎస్‌కే కనుంగో, సేతురామన్‌.. నమూనా రాకెట్‌తో  పూజలు నిర్వహించారు.  

జీశాట్‌–19తో ఉపయోగాలివీ..
జీశాట్‌–19 సమాచార ఉపగ్రహం బరువు 3,136 కిలోలు. ఇది దేశంలో టెలివిజన్‌ ప్రసారాలు, టెలికం రంగంలో విస్తృతసేవలు, ఇంటర్నెట్‌ వేగవంతంగా పనిచేయడమేగాక అధునాతనమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి తెస్తుంది.  ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ఇంటర్నెట్‌ను వేగవంతం చేయడానికి ఎంతో ఉపకరిస్తుంది.  ఉపగ్రహంలో  కేయూ బాండ్‌ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌పాండర్స్‌తోపాటు జియో స్టేషనరీ రేడియేషన్‌ స్పెక్ట్రోమీటర్‌ పేలోడ్స్‌ను అమర్చి పంపుతున్నారు. 3,136 కిలోల ఉపగ్రహంలో 1,742 కిలోల ఇంధనం నింపారు. పేలోడ్స్‌ బరువు 1,394 కిలోలు.   జీశాట్‌–9 ఉపగ్రహం పదేళ్లపాటు సేవలు అందిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement