నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి కొంతకాలంగా పాకిస్తాన్ వైపు నుంచి సాగుతున్న అరాచకానికి తొలిసారి భారత సైన్యం నుంచి దీటైన జవాబు వెళ్లింది. 1971నాటి యుద్ధం తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారి ఎల్‌ఓసీని దాటి పాకిస్తాన్ భూభాగంలో మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి ఏడు చోట్ల గుర్తించిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురువారం వేకువజామున మన సైన్యం మెరుపు దాడుల్ని నిర్వహించింది. 38మందిని మట్టుబెట్టి మరి కొందర్ని అదుపులోకి తీసుకున్నారంటే... ఆ సంగతి మనం వెల్లడించేవరకూ ఇతర దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా తెలియదంటే ఈ మొత్తం ఆపరేషన్ ఎంత పకడ్బందీగా నిర్వహించారో అర్ధమవుతుంది.
ఎంచుకున్న ప్రాంతంలో, అనుకున్న సమయానికి, ముందుగా నిర్ణయించిన విధంగా దాడులు జరపడం... ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించడం... అదే సమయంలో ఇటువైపు ఎలాంటి ప్రాణ నష్టమూ లేకుండా చూసుకోవడం మన సైనిక కమాండోల తిరుగులేని సామర్ధ్యాన్ని వెల్లడిస్తుంది. 250 కిలోమీటర్ల విస్తృతిలో ఎల్‌ఓసీ ఆవల హెలికాప్టర్లలో బలగాలను దించి ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. దీన్నంతటినీ ద్రోన్ కెమెరాలతో చిత్రించారు.
వారం రోజులుగా ఎల్‌ఓసీలో పకడ్బందీ నిఘా పెట్టి, ఉగ్రవాద స్థావరాలను నిర్దిష్టంగా గుర్తించి ఈ దాడులు నిర్వహించారు. ఈ మాదిరి దాడులకు ఎంతో నైపుణ్యం, సమర్ధత కావాలి. అక్కడి సైనికుల జోలికెళ్తే మొత్తం ఆపరేషన్‌ను వక్రీకరించే ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ విషయంలో మన కమాండోలు అభినందనీయులు. ఏ దేశానికైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, అందుకు భంగం కలిగించే శక్తులపై దాడులు చేయడానికి సర్వహక్కులూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురైనా మన దేశం నిగ్రహం పాటిస్తూ వచ్చింది.
సరిహద్దు ఆవలినుంచి వచ్చిన ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో ఎన్నిసార్లు, ఎంత విధ్వంసం సృష్టించినా... దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబై నగరాన్ని నాలుగు రోజులపాటు గడగడలాడించి 164మందిని పొట్టన బెట్టుకున్నా ఓర్పుతో వ్యవహరించింది. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాదినుంచి సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందజేసి కారకుల్ని పట్టి బంధించి అప్పగిం చాలని కోరింది. మొన్నటి పఠాన్‌కోట్ దాడి వరకూ ఇలా ఎప్పటికప్పుడు చెబు తున్నా బుకాయించడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. భారత్‌లో సాగు తున్న ఉగ్ర దాడులతో తమకు సంబంధమే లేదన్న బలహీనమైన వాదనను వినిపిం చడాన్ని అది రివాజుగా మార్చుకుంది.
అయితే ఉడీ ఉగ్రవాద దాడిలో 18మంది జవాన్ల ప్రాణాలు తీసినప్పటినుంచీ దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెడితే ఇవి మున్ముందు మరింత మితిమీరడం ఖాయమన్న వాదనలు వచ్చాయి. ఏదో చేస్తామన్నారు... ఏం చేస్తున్నారని ఎన్‌డీఏ ప్రభుత్వంపై వివిధ పక్షాలు విమర్శలు కురిపించాయి. అందులో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. మరోపక్క పాకిస్తాన్ ఎప్పటిలానే ఉడీ దాడి ఉదంతాన్ని వక్రీకరించడం మొదలుపెట్టింది. దాంతో తమకు సంబంధమే లేదన్నట్టు ప్రవర్తిం చింది. పెపైచ్చు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై ఎదురుదాడికి దిగారు.
వీటన్నిటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అన్నివిధాలా ఆలోచించింది. పర్యవ సానంగా మన వైఖరిలో గుణాత్మకమైన మార్పు కనబడింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించారు. మనకు హాని తలపెట్టినవారికి నొప్పి తెలిసేలా చేస్తామని రక్షణ మంత్రి పరీకర్ హెచ్చరించారు. ఉడీ ఉగ్రవాద దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను మరువబోమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘నీళ్లూ, నెత్తురూ కలిసి ప్రవహించలేవ’ని అంటూ సింధు నదీ జలాల ఒప్పందం పునఃసమీక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) సమావేశాలకు గైర్హాజరవుతున్నట్టు మన దేశం ప్రకటించింది. బంగ్లా, భూటాన్, అఫ్ఘాన్‌లు తాము సైతం హాజరుకాబోమని తెలిపి ప్రపంచం ముందు పాక్‌ను దోషిగా నిలిపాయి.
కానీ పాకిస్తాన్ దీన్నంతటినీ తేలిగ్గా తీసుకుంది. మా దగ్గర అణ్వాయుధాలు న్నాయి... ప్రయోగించడానికి వెనకాడబోమని హెచ్చరించడం మొదలెట్టింది. ఎన్ని కలకు ముందూ, అధికారంలోకొచ్చాక కొన్నాళ్లు సొంతంగా ఆలోచించినట్టు కనిపిం చిన నవాజ్ షరీఫ్ అక్కడి సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారారు. తనకు తిరుగు లేని ప్రజామోదం ఉన్నా మునుపటి ప్రధానుల మాదిరే బలహీనంగా వ్యవహరిం చడం మొదలుపెట్టారు. అసాధారణ రీతిలో తన పుట్టినరోజునాడు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ వ్యవహార శైలి చూశాకైనా ఆయన మారలేకపోయారు.
పాకిస్తాన్ సైన్యం, దాని ఆధ్వర్యంలోని గూఢచార సంస్థ ఐఎస్‌ఐలు పెంచి పోషించిన ఉగ్రవాద మూకలు తమ దేశానికే ముప్పుగా పరిణ మించినా అక్కడి పౌర సమాజం మద్దతును కూడగట్టి సైన్యం చేష్టలను నియం త్రించడానికి షరీఫ్ ఏమాత్రం ప్రయత్నించలేదు. అమెరికా కూడా ఈ ధోరణుల విషయంలో చూసీచూడనట్టే వ్యవహరించింది. ఈ పరిణామాలపై కళ్లుమూసు కుంది. ఉడీ దాడిని ఖండించడం తప్ప బాధ్యులు మీరేనని పాక్‌కు చెప్పడంలో అది విఫలమైంది.
మన దేశం కూడా ఎల్లకాలమూ చూస్తూ ఊరుకుంటుందనుకోవడం తెలివితక్కువతనం. ఇప్పుడు నిర్వహించిన దాడుల్ని ‘ప్రతీకార చర్య’గా కాక ఉగ్ర వాద చర్యలను నిరోధించడంలో భాగంగా సాగించినవేనని చెప్పడం ద్వారా మన దేశం ఎంతో పరిణతితో వ్యవహరించింది. దీన్ని పాకిస్తాన్ ఎలా చూస్తుందన్నది దాని ఇష్టం. దాడులు నిజంకాదని, ఆవలినుంచి కాల్పులు జరిగాయని తన పౌరు లను నమ్మింపజూస్తున్నది. అయితే అటునుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామా లనైనా ఎదుర్కొనడానికి మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అది తప్పనిసరి. ఈ దశలోనైనా పాకిస్తాన్‌కు వాస్తవ పరిస్థితులు అవగాహనకొచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలకూ, మరీ ముఖ్యంగా అమెరికా తదితర అగ్రరాజ్యాలకూ ఉంది.
జై జవాన్!
Published Fri, Sep 30 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement
Advertisement