
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు.
చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్‌ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్‌ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు.