కశ్మీర్ ఎవరిదనే వివాదంపై ఇప్పటివరకూ భారత్, పాకిస్తాన్ మధ్య రెండు యుద్ధాలు, లెక్కలేనన్ని ఘర్షణలు జరిగాయి. అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య హిమాలయ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కశ్మీరే కారణమవుతోంది. కశ్మీర్ ప్రాంతంలో అధీనరేఖగా పిలిచే సరిహద్దును భారీ ఆయుధాలతో మోహరించి ఉండే ఇరు దేశాల సైనిక దళాలుగానీ, వైమానిక దళాలుగానీ అరుదుగానే దాటాయని చెప్పవచ్చు. దక్షిణాసియాలోని ఈ రెండు దాయాది దేశాల మధ్య ఎత్తైన పర్యత ప్రాంతంలో జరిగిన కొన్ని ప్రధాన ఘర్షణల వివరాలు:
1947: భారత ఉపఖండాన్ని ఇండియా, పాకిస్తాన్‌గా విభజించాక కశ్మీర్ వివాదంపై మొదటి యుద్ధం జరిగింది. కశ్మీర్ మహారాజు (సంస్థానాధీశుడు) హరిసింగ్ తన రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేశాక పాకిస్తాన్ నుంచి గిరిజన పోరాటయోధుల పేరుతో కశ్మీర్ భూభాగంపై దాడి చేశారు.
1965: మళ్లీ కశ్మీర్‌పైనే భారత్, పాకిస్తాన్ స్వల్పస్థాయి యుద్ధం చేశాయి. పోరు ముగిశాక కాల్పుల విరమణ ప్రకటించారు.
1971: భారత్, పాక్ మధ్య మరో యుద్ధం జరిగిందిగాని ఇది కశ్మీర్‌పై కాదు. అప్పటి తూర్పు పాకిస్తాన్ (తూర్పు బెంగాల్)పై ఇస్లామాబాద్(పశ్చిమ పాక్) పెత్తనం కారణంగా స్వాతంత్య్రం కోరుకున్న బంగ్లాదేశీయులకు భారత్ మద్దతు ఇచ్చింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంపై దాడులు జరపగా, పాక్ ఆర్మీ లొంగిపోయింది. ఈ యుద్ధం బంగ్లాదేశ్ అవతరణకు దారితీసింది.
1984: పాక్ తనదని వాదించే కారకోరం పర్వత శ్రేణిలో మనుషులు నివసించే యోగ్యంకాని సియాచిన్ గ్లేసియర్ (హిమానీనదం)ను భారత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో అనేక ఘర్షణలు జరగగా, 2003లో ఇక్కడ కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది.
1999: పాకిస్తాన్ మద్దతుగల తీవ్రవాదులు కశ్మీర్ సరిహద్దు దాటి కార్గిల్ పర్వతాలపై ఉన్న భారత సైనిక పోస్టులను ఆక్రమించుకున్నాక పోరు మొదలైంది. చొరబాటుదారులను భారత సైనిక దళాలు వెనక్కి తరిమివేశాయి. పది వారాలు జరిగిన ఈ ఘర్షణలో ఉభయపక్షాలకు చెందిన వేయి మంది మరణించారు.
2016: భారత్‌లోని ఓ ఆర్మీ స్థావరంపై తీవ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడి జరిగిన రెండు వారాలకు సెప్టెంబర్‌లో పాకిస్తానీ కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలున్న లక్ష్యాలపై ఇండియా మెరుపు దాడులు ప్రారంభించింది. కాని, ఈ దాడులు జరగలేదని పాకిస్తాన్ వాదించింది.
Comments
Please login to add a commentAdd a comment