Indo-Pak Border
-
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
కల్లోలానికి కశ్మీరే కారణం
కశ్మీర్ ఎవరిదనే వివాదంపై ఇప్పటివరకూ భారత్, పాకిస్తాన్ మధ్య రెండు యుద్ధాలు, లెక్కలేనన్ని ఘర్షణలు జరిగాయి. అణ్వాయుధాలున్న ఈ రెండు దేశాల మధ్య హిమాలయ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కశ్మీరే కారణమవుతోంది. కశ్మీర్ ప్రాంతంలో అధీనరేఖగా పిలిచే సరిహద్దును భారీ ఆయుధాలతో మోహరించి ఉండే ఇరు దేశాల సైనిక దళాలుగానీ, వైమానిక దళాలుగానీ అరుదుగానే దాటాయని చెప్పవచ్చు. దక్షిణాసియాలోని ఈ రెండు దాయాది దేశాల మధ్య ఎత్తైన పర్యత ప్రాంతంలో జరిగిన కొన్ని ప్రధాన ఘర్షణల వివరాలు: 1947: భారత ఉపఖండాన్ని ఇండియా, పాకిస్తాన్‌గా విభజించాక కశ్మీర్ వివాదంపై మొదటి యుద్ధం జరిగింది. కశ్మీర్ మహారాజు (సంస్థానాధీశుడు) హరిసింగ్ తన రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేశాక పాకిస్తాన్ నుంచి గిరిజన పోరాటయోధుల పేరుతో కశ్మీర్ భూభాగంపై దాడి చేశారు. 1965: మళ్లీ కశ్మీర్‌పైనే భారత్, పాకిస్తాన్ స్వల్పస్థాయి యుద్ధం చేశాయి. పోరు ముగిశాక కాల్పుల విరమణ ప్రకటించారు. 1971: భారత్, పాక్ మధ్య మరో యుద్ధం జరిగిందిగాని ఇది కశ్మీర్‌పై కాదు. అప్పటి తూర్పు పాకిస్తాన్ (తూర్పు బెంగాల్)పై ఇస్లామాబాద్(పశ్చిమ పాక్) పెత్తనం కారణంగా స్వాతంత్య్రం కోరుకున్న బంగ్లాదేశీయులకు భారత్ మద్దతు ఇచ్చింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంపై దాడులు జరపగా, పాక్ ఆర్మీ లొంగిపోయింది. ఈ యుద్ధం బంగ్లాదేశ్ అవతరణకు దారితీసింది. 1984: పాక్ తనదని వాదించే కారకోరం పర్వత శ్రేణిలో మనుషులు నివసించే యోగ్యంకాని సియాచిన్ గ్లేసియర్ (హిమానీనదం)ను భారత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇదే ప్రాంతంలో అనేక ఘర్షణలు జరగగా, 2003లో ఇక్కడ కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. 1999: పాకిస్తాన్ మద్దతుగల తీవ్రవాదులు కశ్మీర్ సరిహద్దు దాటి కార్గిల్ పర్వతాలపై ఉన్న భారత సైనిక పోస్టులను ఆక్రమించుకున్నాక పోరు మొదలైంది. చొరబాటుదారులను భారత సైనిక దళాలు వెనక్కి తరిమివేశాయి. పది వారాలు జరిగిన ఈ ఘర్షణలో ఉభయపక్షాలకు చెందిన వేయి మంది మరణించారు. 2016: భారత్‌లోని ఓ ఆర్మీ స్థావరంపై తీవ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడి జరిగిన రెండు వారాలకు సెప్టెంబర్‌లో పాకిస్తానీ కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలున్న లక్ష్యాలపై ఇండియా మెరుపు దాడులు ప్రారంభించింది. కాని, ఈ దాడులు జరగలేదని పాకిస్తాన్ వాదించింది. -
పాక్ సరిహద్దుల్లో రాజ్‌నాథ్ దసరా
న్యూఢిల్లీ: భారత్–పాక్ సరిహద్దుల్లోని అత్యంత సున్నిత ప్రాంతమైన బికనూర్‌లో దసరా, ఆయుధపూజ కార్యక్రమాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొననున్నారు. ఇండో–పాక్ సరిహద్దుల్లో ఆయుధపూజ కార్యక్రమంలో ఓ సీనియర్ కేంద్రమంత్రి పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజస్తాన్‌లోని బికనూర్ వద్దనున్న పాక్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లతో ఈ నెల 19న దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే అక్కడి ప్రాంతంలో నిర్వహించబోయే ఆయుధపూజలో కూడా రాజ్‌నాథ్ పాల్గొంటారని వెల్లడించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ ఈ నెల 18న రాత్రి బికనూర్ బోర్డర్ ఔట్‌పోస్టుకు చేరుకుంటారని.. 19న దసరా వేడుకల్లో జవాన్లతో కలసి పాల్గొంటారని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. గతేడాది చైనా సరిహద్దుల్లోని ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో దసరా వేడుకల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. -
దినదిన గండం.. అక్కడ బతకడం
వారికి చెవులకు ప్రార్థనా గీతాలు వినిపించకపోవచ్చు.. కానీ తుపాకీ చప్పుళ్లు వినిపించని రోజుండదు.. దాహార్తికి అలమటించిన క్షణాలు ఉండొచ్చు.. కానీ మోర్టార్ గుళ్ల వర్షం కురవని క్షణాలు ఉండవు. అంతర్జాతీయ సరిహద్ధులోని 42 భారతీయ గ్రామాల్లోని ప్రజలు నిత్యం సమరమే.. ప్రతి క్షణం దినదిన గండమే. ఎప్పుడు తుపాకులు విరుచుకుపడతాయో.. ఏ క్షణంలో పాకిస్తాన్ ముష్కరమూకల మోర్గార్లు పేలుతాయో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ఆర్నియా సెక్టార్.. జమ్మూ కశ్మీర్‌లోని పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ సరిహద్దు వెంబడి 42 గ్రామాల్లో 45 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. మొత్తం 198 కిలోమీటర్ల ఈ సరిహద్దు ప్రజలు నిరంతరం పాక్ సైన్యం జరిపే కాల్పులకు బలి అవుతూనే ఉన్నారు. ఇరు దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పాకిస్తాన్ మాత్రం దానిని ప్రతి రోజూ ఉల్లంఘిస్తోంది. పాక్ సైన్యం ఎప్పుడు మోర్టార్ కాల్పులకు తెగబడుతుందో.. ఏ అర్దరాత్రి.. ఏకే 47 తుపాకులు గుళ్ల వర్షం కురిపిస్తాయో తెలియక.. ఇళ్లలో కన్నా బంకర్లలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. మోర్టార్ల బీభత్సం కశ్మీర్ సరిహద్దు ప్రజలకు శాంతి అంటే.. మోర్టార్లు, తుపాకులు పేలడం అగడం వరకూ అని మాత్రమే తెలుసు. ఆగిన కొద్ది సేపటిలో పనులు పూర్తి చేసుకుని తిరిగి గుళ్ల వర్షం కురిసే లోపు.. సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. సెప్టెంబర్16-17 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం ఆర్నియా సెక్టార్లోఅర్దరాత్రి కాల్పులకు తెగబడింది. ఈ సమయంలో సరిహద్దు గ్రామంలోని రత్నాదేవి (50) అనే మహిళకు బుల్లెట్లు తాకి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె భర్త చునాయి లాల్ మాట్లాడుతూ.. పాక్‌సైన్యం రాత్రంతా కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. ఇటువంటివి ఇక్కడ ప్రతి రోజూ జరుగుతాయని చెప్పారు. చిన్నారుల పరిస్థితి విషయం సరిహధ్దు గ్రామాల్లోని చిన్నారుల పరిస్థితి మరీ విషయంగా ఉందని గ్రామస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర 16-17 తేదీల్లో పాక్ కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు. ఇక పాక్‌రేంజర్ల కాల్పుల్లో వందలాది మంది చిన్నారులు కాళ్లు, చేతులు కోల్పోవడం, చూపు దెబ్బతినడం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాక్‌రేంజర్లు 82, 120 ఎంఎం మోర్టార్లతో జరిపే కాల్పుల్లో ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటోందని వారు స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్ అగమ్యగోచరం సరిహద్ధు ప్రాంతాల్లోని చిన్నారుల భవిష్యత్ అగమ్యగోచరమే. ఇక్కడి చిన్నారులు సాధారణ జీవితానికి చాలా దూరం. ఆర్నియా సబ్ సెక్టార్లో మొత్తం 33 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 1500 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ పాఠశాలలు ఏడాది మొత్తం కొన్ని వారాలు మాత్రమే పనిచేస్తాయని.. స్థానికులు అంటున్నారు. చిన్నారులు స్వేచ్ఛగా తిరగడం, ఆడుకోవడం, చదువుకోవడం ఇక్కడ కుదరదు. బంకర్లే ఆవాసాలు సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు భారత సైన్యం ఏర్పాటు చేసిన బంకర్లే స్థిర నివాసాలుగా మారాయి. ఇక్కడ ఒక్కో బంకర్లో సగటున 7 వేల మంది ఉంటున్నారు. ఈ బంకర్లలోనే ప్రజలు నెలలతరబడి గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే సరిహద్దు గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఒక బంకర్‌ను నిర్మించింది. ప్రభుత్వం సుమారు రూ. 5లక్షలతో ఏర్పాటు చేసిన బంకర్ల తరువాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని థోరు రామ్ (56) చెబుతున్నారు. మోర్టార్ శబ్దాలు మొదలవగానే.. మేమంతా బంకర్లలోకి వెళ్లిపోతామని ఆయన చెబుతున్నారు. ఇక రాజౌరీ జిల్లాల్లో 621 కమ్యూనిటీ బంకర్లను 8,197 వ్యక్తిగత బంకర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి. -
చంద్రబాబును కలిసిన మాస్టర్ రవికర్
అమరావతి : ఇండో పాక్ బోర్డర్లోని సరిహద్దులో భద్రత, ఇతర విషయాలను చూసి వచ్చిన మాస్టర్ రవికర్, వారి తల్లిదండ్రులు నరసింహారెడ్డి, ఇందిరతో కలిసి ఆదివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశాడు. ఈ సందర్భంగా మాస్టర్ రవికర్ను చంద్రబాబు అభినందించారు. మహానాడులో పాల్గొనే అవకాశం కల్పించాలని రవికర్ కోరగా తదుపరి మహానాడులో పాల్గొనేందుకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా అయిదో తరగతి చదువుతున్న మాస్టర్ రవికర్ రెడ్డి సరిహద్దు భద్రతా సేవలను ప్రత్యక్షంగా చూడాలని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాయడంతో బీఎస్ఎఫ్ డీజీ కె.కె.శర్మ స్పందించి బోర్డర్లో మార్చి 21 నుంచి 26 వరకు పర్యటనకు అనుమతించారు. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రవికర్ సీఎంను కలిశాడు. Met Ravikar, a young & bright student who was invited by KK Sharma, Director General- BSF, to visit the Indo-Pak border zone in March. pic.twitter.com/ClMkbLfoJM — N Chandrababu Naidu (@ncbn) 18 June 2017 -
సరిహద్దు వద్ద చొరబాటుదారుడి కాల్చివేత
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుదారుడిని సరిహద్దు భద్రత దళాలు కాల్చి చంపాయి. మంగళవారం పంజాబ్‌లోని పటాన్‌కోట్ బమియల్ సెక్టార్లో ఈ ఘటన జరిగింది. సరిహద్దు వద్ద గస్తీ నిర్వహిస్తున్న జవాన్లు జరిపిన కాల్పుల్లో చొరబాటుదారుడు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు చెప్పారు. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి అక్రమంగా వచ్చాడని తెలిపారు. గతేడాది పాకిస్తాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై దాడి చేశారు. -
భారత్-పాక్ బోర్డర్లో మానవ రహిత విమానాలు!
న్యూఢిల్లీ: భారత్-పాక్ బోర్డర్లో మంగళవారం అలజడి రేగింది. మానవ రహిత విమానాలు(యూఎవీ)లు తిరుగుతున్నట్లు బీఎస్ఎఫ్ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ తో సరిహద్దును కలిగిన ఉన్న పశ్చిమ ప్రాంతంలో పరిస్ధితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. నియంత్రణ రేఖకు అవలి నుంచి తరచూ దాడులు జరుగుతుండటంతో ఆర్మీకి దన్నుగా నిలిచేందుకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించినట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ చెప్పారు. బంగ్లాదేశ్ కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)తో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరువర్గాలు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు జరిపిన సంప్రదింపులు విజయవంతమైనట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ భూభాగం నుంచి ఉగ్రదాడులు జరుగుతాయనే సమాచారం లేకపోయినప్పటికీ ముందస్తు చర్యగా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ఇండో-పాక్, ఇండో-బంగ్లా బోర్డర్లో గస్తీని పెంచినట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ, పంజాబ్, రాజస్ధాన్, గుజరాత్ లలో ఎలాంటి భద్రతా ఒప్పందాల ఉల్లంఘన జరగలేదని తెలిపారు. భారత్ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో వచ్చిన మానవ రహిత విమానంపై ఆయన స్పందించారు. భారత్ సంసిద్ధతను తెలుసుకునేందుకు పాక్ యూఏవీని ఉపయోగించి ఉంటుందని అన్నారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సరిహద్దు గ్రామాలను బలగాలు ఖాళీ చేయించలేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ముందస్తు చర్యగా ప్రజలను తరలించాయని చెప్పారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న పొలాలకు రైతులను వెళ్లనిస్తున్నట్లు తెలిపారు. -
కారులో బార్డర్ దాటబోయిన ఎన్నారై!
అమృత్సర్: ఓ ఎన్నారై కారులో భారత్-పాకిస్థాన్ సరిహద్దులను దాటుతూ దొరికిపోయాడు. మానసిక చికిత్స పొందుతున్న అతను కారు నడుపుకుంటూ వెళ్లి.. అట్టారి-వాఘా మార్గంలో అంతర్జాతీయ సరిహద్దు కంచెను ఢీకొట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) అతన్ని అదుపులోకి తీసుకుంది. అతన్ని కెనడా నుంచి వచ్చిన ఎన్నారై సురిందర్ సింగ్ కాంగ్‌గా గుర్తించారు. అతని స్వస్థలం జలంధర్. పాకిస్థాన్‌లోని నాన్కానా సాహిబ్‌ను దర్శించుకోవాలని భావించానని, ఇందుకు వీసా తీసుకోవడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో తానే నేరుగా సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అతను కారు నడుపుతూ భారత్-పాక్ సరిహద్దు మొదటి గేటు దాటి వచ్చి.. కస్టమ్ కంచెను ఢీకొట్టాడు. దీంతో ఓ స్తంభం కూలిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన బీఎస్ఎఫ్ సిబ్బంది ఆయనను అడ్డుకుంది. ప్రాథమిక విచారణలో ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదని తేలిందని, అందుకే ఆయన ఇలా విపరీతంగా ప్రవర్తించాడని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. -
రూ. 60 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
అమృతసర్: భారత్ - పాక్ సరిహద్దుల్లో 12 కేజీల హెరాయిన్‌ను సీజ్ చేసినట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు బుధవారం అమృతసర్‌లో వెల్లడించారు. సరిహద్దుల్లోని చిన్న బిద్ చంద్ సెక్టర్లోని పంటపోలాల్లో పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో ఈ హెరాయిన్‌ను కనుగొన్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు రాత్రి పూట గస్తీ తిరుగుతున్న సమయంలో పాకిస్థానీయులు ఈ హెరాయిన్ వదలి వెళ్లారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కానీ అయితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. 60 కోట్లు ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉద్దర్ దరీవాల సెక్టర్లో ఆరు కిలోల హెరాయిన్ పట్టికున్న సంగతి తెలిసిందే. 2015లో సరిహద్దు ప్రాంతంలో ఇప్పటివరకు 230 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో 1150 కోట్లు ఉంటుందన్నారు. -
సరిహద్దులో సొరంగం
అక్నూర్: భారత్-పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత భూభాగం వైపుగా తవ్విన ఓ సొరంగాన్ని సైన్యం శుక్రవారం కనుగొంది. జమ్మూలోని పల్లన్వాలా సెక్టార్లో చక్లా పోస్టు వద్ద తవ్విన ఈ సొరంగం రెండున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు, 50 మీటర్ల పొడవు ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. రోజువారీ విధుల్లో భాగంగా గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలు ఈ సొరంగాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల చొరబాట్ల కోసమే ఈ సొరంగం తవ్వి ఉంటారని, అయితే భారత్ వైపు సొరంగం పూర్తి కాలేదు కాబట్టి.. ఇంతవరకూ దీనిద్వారా ఎలాంటి చొరబాట్లు జరగలేదన్నారు. కాగా, జూలై 22న ఉగ్రవాదుల చొరబాటును సైన్యం అడ్డుకున్న సందర్భంగా ఓ ఉగ్రవాదితో పాటు జవానూ చనిపోయారు. ప్రస్తుత సొరంగం ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. 2008లో కూడా ఇదే ప్రాంతంలో ఓ సొరంగాన్ని సైన్యం కనుగొంది. -
జమ్మూ సరిహద్దులో పాక్ కాల్పులు
జమ్మూ-పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ మరో సారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పాక్ సేనలు పూంఛ్ సెక్టర్ లోని షాహ్ పూర్ వద్ద మోహరించిన ఉన్న భారత సైనికులపై కాల్పులు జరిపాయి. దీనికి భారత జవాన్లు దీటైన జవాబిచ్చారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను భారత్ లోకి జొప్పించేందుకు, జవాన్ల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఈ కాల్పులకు పాల్పడిందని భద్రతాధికారులు చెబుతున్నారు.