కారులో బార్డర్ దాటబోయిన ఎన్నారై!
అమృత్‌సర్: ఓ ఎన్నారై కారులో భారత్-పాకిస్థాన్ సరిహద్దులను దాటుతూ దొరికిపోయాడు. మానసిక చికిత్స పొందుతున్న అతను కారు నడుపుకుంటూ వెళ్లి.. అట్టారి-వాఘా మార్గంలో అంతర్జాతీయ సరిహద్దు కంచెను ఢీకొట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) అతన్ని అదుపులోకి తీసుకుంది. అతన్ని కెనడా నుంచి వచ్చిన ఎన్నారై సురిందర్ సింగ్ కాంగ్‌గా గుర్తించారు. అతని స్వస్థలం జలంధర్.
పాకిస్థాన్‌లోని నాన్‌కానా సాహిబ్‌ను దర్శించుకోవాలని భావించానని, ఇందుకు వీసా తీసుకోవడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో తానే నేరుగా సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించానని ఆయన తెలిపారని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అతను కారు నడుపుతూ భారత్-పాక్ సరిహద్దు మొదటి గేటు దాటి వచ్చి.. కస్టమ్ కంచెను ఢీకొట్టాడు. దీంతో ఓ స్తంభం కూలిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది ఆయనను అడ్డుకుంది. ప్రాథమిక విచారణలో ఆయన మానసిక ఆరోగ్యం బాగాలేదని తేలిందని, అందుకే ఆయన ఇలా విపరీతంగా ప్రవర్తించాడని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.