
బీజింగ్: కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారిన చైనా, భారత్ దేశాల సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ప్యాంగ్యాంగ్ సొ సరస్సు దక్షిణ, ఉత్తర సరిహద్దుల నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ బుధవారం ప్రారంభమైందని చైనా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే, చైనా చేసిన ఈ ప్రకటనపై భారత్ స్పందించలేదు. ‘ప్యాంగ్యాంగ్ సొ సరస్సుకు దక్షిణ, ఉత్తర తీరాల వద్ద ఉన్న చైనా, భారత్ దేశాల ఫ్రంట్‌లైన్ దళాల ప్రణాళికాబద్ధ ఉపసంహరణ ఫిబ్రవరి 10న ప్రారంభమైంది’ అని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి, సీనియర్ కల్నల్ వూ క్విన్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన తొమ్మిదవ విడత చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత్ బలగాల ఉపసంహరణ ప్రారంభమైందన్నారు.