న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌ఓ) నిర్మించింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్‌లింగ్లా పాస్ వద్ద 52 కిలోమీటర్ల పొడవునా వాహనాలు వెళ్లగలిగే (మోటరబుల్) ఈ రహదారిని నిర్మించినట్లు భారత రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటిదాకా ఎత్తయిన మోటరబుల్ రోడ్డుగా బొలీవియాలోని రహదారి రికార్డుకెక్కింది. అక్కడ 18,953 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మించారు.
ఉమ్‌లింగ్లా పాస్ వద్ద నిర్మించిన రహదారి తూర్పు లద్దాఖ్‌లో చుమార్ సెక్టార్‌లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తోంది. లేహ్ నుంచి చిసుమ్లే, డెమ్‌చోక్‌కు చేరుకోవడం సులభతరం అయ్యిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ రహదారితో లద్దాఖ్‌లో పర్యాటక రంగం వృద్ధి చెంది స్థానికుల ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment