Nag missile test
-
అమ్ముల పొదిలో నాగాస్త్రం
జైపూర్: మన దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో గురువారం ఉదయం 6:45 గంటలకి నాగ్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్టు డీఆర్డీఓ వెల్లడించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఏటీజీఎం)ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. నాగ్ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయినా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి క్యారియర్ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్ బిఫోర్ లాంచ్’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాగ్ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పోఖ్రాన్లో నింగిలోకి దూసుకెళ్తున్న నాగ్ క్షిపణి -
భారత ఆర్మీకి ‘నాగ్’ శక్తి
న్యూఢిల్లీ : 300 నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌ను భారతీయ ఆర్మీ తీసుకోనుంది. 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాల యుద్ధట్యాంకులను నాగ్ క్షిపణి నాశనం చేయగలదు. 1980వ దశకంలో 5 రకాల క్షిపణులను భవిష్యత్ అవసరాల కోసం అభివృద్ధి చేయాలని భారత్ భావించింది. వాటిలో నాగ్ క్షిపణి కూడా ఒకటి. అయితే, ఆ తర్వాత పలు రకాల కారణాల వల్ల నాగ్ క్షిపణుల అభివృద్ధి ఆలస్యం అవుతూ వచ్చింది. రక్షణ శాఖ అధికారుల సమాచారం మేరకు 300 నాగ్ క్షిపణులు, 25 నాగ్ మిస్సైల్ కారియర్స్(నామికా)ను భారత ఆర్మీ తీసుకోనుంది. నామికా ద్వారా ఒకేసారి ఆరు నాగ్ క్షిపణులను ప్రయోగించొచ్చు. నాగ్ క్షిపణుల పరీక్షించిన తర్వాత ఆర్మీ 3 వేల క్షిపణులను తీసుకునే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రు యుద్ధట్యాంకులను నాశనం చేయగల సామర్ధ్యం నాగ్ మిస్సైల్స్ సామర్ధ్యం. అందుకే వీటిని ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి అంటారు. -
నాగ్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన మూడో తరం ఏటీజీఎం(యాంటీ–ట్యాంక్ గైడెడ్ మిసైల్) నాగ్ పరీక్ష విజయవంతమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నాగ్ క్షిపణిని రాజస్తాన్‌లోని ఎడారిలో పరీక్షించింది. ఈ ఏడాది జూన్‌లోనూ ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. శుక్రవారం నాగ్‌ను రెండుసార్లు పరీక్షించగా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. 7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది నాశనం చేయగలదు. పరీక్షలు సక్సెస్‌కావడంతో భారత్‌కు మరో కొత్త క్షిపణి త్వరలోనే అందుబాటులోకి రానుంది.