న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు(9న) ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకుగాను 29 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి.
పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. క్విబ్ కోటాలో మాత్రం 0.67 శాతమే స్పందన కనిపించింది. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఎల్‌ఐసీ ఐపీవో ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకోవాలని చూస్తోంది.
5 కోట్ల మార్క్
తొలిసారి 5 కోట్ల అప్లికేషన్ల మైలురాయిని దాటిన ఐపీవోగా ఎల్‌ఐసీ నిలిచినట్లు పేటీఎమ్ మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దరఖాస్తుపై సగటు పెట్టుబడికంటే అధికంగా రూ. 29,000 చొప్పున లభిస్తున్నట్లు తెలియజేశారు. యూపీఐ ద్వారా ఐపీవోకు రూ. 5 లక్షలవరకూ అనుమతించడంతో హెచ్‌ఎన్‌ఐ పెట్టుబడులు సైతం తరలివస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment