
కరోనా వచి్చనా... వేరియంట్లతో కలకలం రేపినా... ఓ ఏడాది వాయిదా పడినా... ఆఖరి దాకా అనుమానాలే ఉన్నా... మెజార్టీ జపనీయులు వ్యతిరేకించినా... సక్సెస్ (ఒలింపిక్స్)... డబుల్ సక్సెస్ (పారాలింపిక్స్)... టోక్యో ఇప్పుడు వేదిక కాదు... ముమ్మాటికి విజేత!
ఎనిమిదేళ్ల జపాన్ శ్రమ వృథా కాలేదు. నాడు ఆతిథ్య హక్కులు పొందిన రాజధాని (టోక్యో) నేడు హ్యాపీగా ముగించేంత వరకు... చేసిన కసరత్తు, పడిన శ్రమ, వెచ్చించిన వ్యయం, కట్టుదిట్టంగా రూపొందించిన నియమావళి, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కుదిరాయి. మాటు వేసిన మహమ్మారిని జయించి మరీ ఒలింపిక్స్, పారాలింపిక్స్ భేషుగ్గా జరిగాయి. భళారే అన్నట్లుగా ముగిశాయి. ప్రేక్షకులు లేని లోటు ఉన్నా... ఆటగాళ్లకు, అధికారులకు ఏ లోటు లేకుండా జపాన్ పకడ్బందీగా పనులు చక్కబెట్టిన తీరుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), పారాలింపిక్ కమిటీ (ఐపీసీ), ప్రపంచ క్రీడా సమాఖ్యలు ఫిదా అయ్యాయి.
టోక్యోకు జయ హో అన్నాయి.
ఇక ఒలింపిక్ టార్చ్ చలో చలోమని పారిస్ (2024) బాట పట్టింది. ఇంకో మూడేళ్లే ఉన్న తదుపరి ఒలింపిక్స్ కోసం ఫ్రాన్స్ ఏర్పాట్లలో తలమునకలైంది. మనం... అందరం... కలుద్దాం పారిస్‌లో..! సందడి చేద్దాం ఒలింపిక్స్‌లో!
ఎదురులేని చైనా
మొత్తం 162 దేశాలు పాల్గొన్న టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించింది. 124 పతకాలతో బ్రిటన్ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్ 2024లో పారిస్‌లో జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment