ఏడాది ఆలస్యం తర్వాత ప్రారంభమైన క్రీడా సంబురం ఒలింపిక్స్.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే మొదలైంది. టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వక్రీడల సమరాన్ని ఆసక్తిగా తిలకించబోతున్నారు కోట్లాది ప్రజలు. అయితే నిన్న ఆరంభ వేడుకల్లో జరిగిన ఓ ఈవెంట్.. ఎవరికీ అంతుబట్టని రీతిలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పక్క డ్యాన్సులు కొనసాగుతున్న టైంలో.. ఆ వెలుగుల జిగేలులో ట్రెడ్‌మిల్‌పై ఓ మహిళ పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఎవరు? ఎందుకలా చేసింది? అనే ప్రశ్నలతో పాటు ఆ ట్రెడ్‌మిల్ వీడియో సోషల్ మీడియాలో మీమ్‌లా వైరల్ అవుతోంది.
ఆమె పేరు అరిస సుబాటా. వయసు 27 ఏళ్లు. జపాన్‌కే చెందిన ఆమె ఒక ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. కానీ, పిడిగుద్దులతో బాక్సర్‌గా కూడా ఆమెకు మాంచి గుర్తింపు ఉంది ఈ దేశంలో. ఒలింపిక్స్ అర్హత కోసం ఏడాదిన్నరగా కష్టపడిందామె. కానీ, కరోనా ఆమెను ఘోరంగా ఓడించింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ రద్దు చేయడంతో ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే ఆమె విజ్ఞప్తి మేరకు ఇలా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ట్రెడ్‌మిల్‌పై సందడి చేసింది.
పేద కుటుంబంలో పుట్టిన సుబాటా కెరీర్‌లోకి అడుగుపెట్టి మూడేళ్లే అయ్యింది. అయితేనేం జపాన్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఎదిగింది. కరోనా టైంలో ఆటగాళ్లంతా ఐసోలేషన్‌లో మెగా టోర్నీని సన్నద్ధం అవుతుంటే.. ఆమె మాత్రం నర్సుగా తన విధుల్ని నిర్వహిస్తూనే మరోవైపు ఒలింపిక్స్ కోసం రేయింబవళ్లు కష్టపడింది. కానీ, ఆ కష్టం వృథా అయ్యింది. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్ని రద్దుచేసేసింది ఐవోసీ. అంతేకాదు 2017 నుంచి ప్రపంచ ర్యాంకింగ్‌ల ఆధారంగా 53 బాక్సర్లను మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసింది.
తనకు అవకాశం దక్కకపోవడంపై ఆమె నిరాశ చెందింది. అయితేనేం మిగతా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది. ‘ట్రెడ్‌మిల్‌పై నేను చూపించింది నా కష్టం మాత్రమే కాదు.. వేలమంది అథ్లెట్ల కష్టానికి ప్రతీక. వాళ్లందరికీ ఆల్‌దిబెస్ట్ చెబుతున్నా. తన చేష్టలను చాలామంది నవ్వుకోవచ్చు. కొందరు మెచ్చుకోవచ్చు. కానీ, మిగతా ఆటగాళ్లను అందరూ ప్రోత్సహించండి. ఏదో ఒకనాటికి ఛాంపియన్ అయ్యి తీరుతా’ అని కన్నీళ్లతో మీడియాతో మాట్లాడిందామె.
Comments
Please login to add a commentAdd a comment