పరిశోధనలతోనే పురోగతి: అబ్దుల్ కలాం
హైదరాబాద్: శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరిన్ని పరిశోధనలు జరిగి నూతన ఆవిష్కరణలు వెలువడితే దేశం పురోగతి చెందుతుందని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల బయోమెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నానో-బయో-ఇన్‌ఫో-కాగ్నో(ఎన్‌బీఐసీ) అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.వీఎస్‌ఎస్ కుమార్ అధ్యక్షత వహించగా కలాం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్న నూతన విజ్ఞానాన్ని విద్యార్థులు వెంటనే నేర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో సౌరవిద్యుత్తు ఉపయోగం పెరుగుతుందని, దానిపై మరిన్ని పరిశోధనలు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఇన్‌చార్జి వీసీ వికాస్‌రాజ్, రిజిస్ట్రార్ ప్రొ.ప్రతాప్‌రెడ్డి, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డి.సుమన్ తదితరులు పాల్గొన్నారు.