సాక్షి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇంటర్నేషనల్ బ్లాక్‌చెయిన్ కాంగ్రెస్ (ఐబీసీ) ఫౌండర్ అభిషేక్ పిట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌నెట్ మూడో తరంగా పిలుచుకునే వెబ్ 3.0లో అపార అవకాశాలున్నాయన్నారు. మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు మంచి డిమాండ్ రాబోతోందన్నారు. వాణిజ్య, వ్యాపార అవసరాలకు వెబ్ 3.0 ఉపయుక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 90 వేల సంస్థలకు వెబ్ 3 ఉద్యోగులు అవసరమని వెల్లడించారు.
అంతర్జాతీయ సంస్థలైన పోల్కాడాట్, అవలాంచ్, ఆప్టాస్ మొదలైన సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. ఏడాదికి వెబ్ 3 ఇంజనీర్లు కనీసం 80 వేల డాలర్ల వరకు సంపాదించవచ్చన్నారు. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో వీరికే అత్యధిక వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. వెబ్ 3.0 ఇంజనీర్ల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి మంచి విజన్ ఉందని చెప్పారు. అందుకే రాష్ట్రంలో 20 వేల మంది విద్యార్థులకు వెబ్ 3.0లో నైపుణ్య శిక్షణతోపాటు హ్యాకథాన్ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఐబీసీ హ్యాక్‌ఫెస్ట్ చాలెంజ్ సదస్సు ప్రారంభం సందర్భంగా ‘సాక్షి’తో అభిషేక్ పిట్టి పలు విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
భవిష్యత్తుని శాసించేవి ఇవే..
వెబ్, వెబ్ 1.0 నుంచి వెబ్ 2.0కి మారడానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. ఇప్పుడు వెబ్ 3.0 అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వెబ్ 3.0 అనేది ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్.. ఇలా రెండింటినీ మేళవిస్తూ అభివృద్ధి చెందిన సాంకేతికత. దీనిద్వారా క్రిప్టోకరెన్సీ, టోకనైజేషన్‌తో కూడిన బ్లాక్‌చెయిన్ ఆ«ధారిత ఇంటర్‌నెట్ ప్రోగ్రామ్‌లను వేగవంతం చేయొచ్చు. దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ వెబ్ 3.0కి ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచే విద్యార్థులు దీనిపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ కంపెనీలు రెడ్‌కార్పెట్ పరుస్తాయి. వెబ్ 3లో రస్ట్, సాలిడిటీ, మూవ్, సబ్‌స్ట్రేట్ వంటి లాంగ్వేజ్ కోర్సులు వచ్చాయి. భవిష్యత్తుని శాసించేవి ఇవే. కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా గ్రాడ్యుయేట్స్ సైతం వెబ్ 3 డెవలపర్స్‌గా శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
యువతకు అంతర్జాతీయ నైపుణ్యాలు
క్రిప్టో కరెన్సీ, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రంగాల్లో డిజిటల్ సమాచారాన్ని భద్రపరిచేందుకు వినియోగించే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి మంచి డిమాండ్ ఉంది. దీనిపై యువత దృష్టి సారించేందుకు ఇంటర్నేషనల్ బ్లాక్‌చెయిన్ కాంగ్రెస్ (ఐబీసీ)హ్యాకథాన్లని నిర్వహిస్తోంది. సంప్రదాయ డెవలపర్స్‌తో పోలిస్తే ఈ టెక్నాలజీ ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అలవడతాయి. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ డేటా భద్రత, ప్రైవసీని మెరుగుపరిచేందుకు వెబ్ 3ని ఎంపిక చేసుకుంటున్నాయి.
నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం అడుగులు..
విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందించేందుకు ఏయే అవకాశాలున్నాయనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అధ్యయనం చేస్తోంది. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మా సంస్థ నిర్వహిస్తున్న హ్యాకథాన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. ఇక్కడ 8 రోజుల పాటు వెబ్ 3.0లో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి శిక్షణ ఇస్తాం. వారికి ఫౌండేషన్ కోర్సును కూడా ఉచితంగా అందిస్తున్నాం. తెలంగాణలో 20 వేల మందికి శిక్షణ ఇచ్చాం. ఏపీలోనూ 20 వేల మందికి శిక్షణ అందించాలని నిర్ణయించాం. కొత్త టెక్నాలజీలో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందాలన్నదే ఐబీసీ ప్రధాన లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment