![Andhra Pradesh Statewide Skill Development Survey - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/14/SKILLL.jpg.webp?itok=7n9hkbtB)
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు ఆసక్తిగల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ సర్వే నిర్వహిస్తోంది. వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి నిరుద్యోగ యువత పేర్లను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అభ్యర్థికి ఆసక్తిగల కోర్సు, ఏ ప్రాంతంలోని స్కిల్ హబ్‌లో శిక్షణ పొందాలనుకుంటున్నారో కూడా నమోదు చేస్తున్నారు.
ఈ డేటా ఆధారంగా అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండటంతోపాటు అవసరమైనచోట వారి సేవలను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27,655 మంది పేర్లను స్కిల్ హబ్స్ అప్లికేషన్‌లో నమోదు చేశారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13,056 మంది అభ్యర్థుల పేర్లు స్కిల్ హబ్స్ అప్లికేషన్‌లో నమోదయ్యాయి.
ఈ సర్వేకి సంబంధించి విస్త్రత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. స్కిల్ డెవలప్‌మెంట్ సర్వే పురోగతిని ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్‌శర్మ సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సర్వే పూర్తిచేయించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment