సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యార్ధుల సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈమేరకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో ఎంవోయూ కుదుర్చుకోగా గడువు తేదీని వచ్చే ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
ఒప్పందం ప్రకారం గడువు ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుతో ముగుస్తున్నప్పటికీ కరోనాతో విద్యాసంస్థలు దీర్ఘకాలం మూతపడటం, విద్యార్థులు నెలల తరబడి కాలేజీలకు దూరం కావడంతో ఒప్పందం గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను వెచ్చిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణ ప్రాజెక్టు అమలు కోసం పర్యవేక్షణ, మూల్యాంకన కమిటీని ప్రభుత్వం నియమించింది.
40 కోర్సులలో శిక్షణ
మైక్రోసాఫ్ట్ సంస్థ అధునాతన సాఫ్ట్‌వేర్ అంశాలపై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక డొమైన్ ద్వారా 40 సర్టిఫికేషన్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.7,500 (100 యూఎస్ డాలర్లు) విలువ గల ‘అజూర్‌పాస్’ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. దీని ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ ఇన్ లెర్నింగ్’ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి.
అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్ సర్వీసులు అందుతాయి. శిక్షణ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ లెర్న్ (ఎంఎస్ లెర్న్) ముఖ్యమైన ప్లాట్‌ఫాంగా ఉంటుంది. సెల్ఫ్‌పేస్‌డ్, డిజిటల్ లెర్నింగ్ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది.
ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత కమిటీ
1.62 లక్షల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా కరోనా వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినందున 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ గుర్తించిన సంస్థల ద్వారా మాక్ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్‌లో భద్రపరుస్తారు.
ఎంతో ప్రయోజనకరం
విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాల శిక్షణపై మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ ప్రతిపాదనలు అందించిన అనంతరం ప్రభుత్వం సంబంధిత నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలతో రాష్ట్ర విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా స్టేక్‌హోల్డర్ల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది.
మైక్రోసాఫ్ట్ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓమ్‌జివాన్ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్ ప్రోగ్రామ్స్‌లో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment