సాంకేతిక రంగంలో రెండు దశాబ్దాల విశేష అనుభవం. మోటరోలా, సిస్కో వంటి కంపెనీలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం.. మైక్రోసాఫ్ట్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్... ఫేబుల్స్ ఆప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్... ఎన్నో విజయాలు సాధించారు విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్. మరింతమంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలంటూ వారిని ఆహ్వానిస్తున్నారు. ‘మహిళలు సాంకేతిక రంగంలోకి ప్రవేశించి, అత్యున్నత స్థాయికి ఎదగాలి. స్త్రీలు ఉన్నతాధికారులుగా మారే రోజులు రావాలి. మీకు మీరుగా స్వయంగా ఎదగాలి. కొత్తకొత్త వ్యవస్థలను నిర్మించాలి, మీ అనుభవాలను అందరికీ పంచాలి’’ అంటారు పద్మశ్రీ వారియర్.
ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చి, అనేక రంగాలలో పనిచేస్తూ, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. కొన్ని దశాబ్దాల ముందు వరకు మహిళలు పైకి ఎదగడానికి చాలా నిచ్చెనలే ఎక్కవలసి వచ్చేది. నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఆలోచించవలసి వచ్చేది. ఆ రోజుల్లోనే అవలీలగా నిచ్చెనలు ఎక్కినవారిలో పద్మశ్రీ వారియర్ ప్రముఖంగా కనిపిస్తారు. సాంకేతిక రంగంలో నిస్సందేహంగా ప్రముఖ పాత్ర పోషించారు. మోటొరోలా, సిస్కో, టెస్టా కాంపిటీటర్ నియో కంపెనీలలో అపారమైన అనుభవం సంపాదించి, ఇప్పుడు స్వయంగా ‘ఫేబుల్’ ఆప్‌ను ప్రారంభించి, అందరూ మంచిమంచి పుస్తకాలు చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ‘‘మహిళలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి, భవిష్యత్తులో సాంకేతిక రంగానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాను’’ అంటారు పద్మశ్రీ వారియర్.
అన్నిటికీ తట్టుకోవాలి...
ఒక రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. అవకాశం దొరికినప్పుడు విడిచిపెట్టకుండా అందిపుచ్చుకుని, విజయాలు సాధించాలి. నిర్ణయం తీసుకోవటంలో జాగ్రత్తగా వహించాలి.. అంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగబోతున్న మహిళలకు సలహా ఇస్తారు పద్మశ్రీ వారియర్. రెడ్‌పాయింగ్ వెంచర్స్ సంస్థ అందించిన 7.25 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఆప్‌ను ఎంతో ధైర్యంగా లాంచ్ చేశారు పద్మశ్రీ వారియర్. వార్షిక చందా కట్టి, ఈ – బుక్స్ ద్వారా పుస్తకాలను ఆన్‌లైన్‌లో కొనుక్కుని చదువుకోవచ్చు. 120 మిలియన్ల వాడకం దారులు ఉన్న గుడ్‌రీడ్స్ కంపెనీని తట్టుకుని, ముందుకు వెళ్లేలా ‘ఫేబుల్’ని రూపొందించారు పద్మశ్రీ వారియర్.
సోషల్ మీడియాలో చర్చ..
పద్మశ్రీ వారియర్ ఈ ఆప్‌ను ప్రారంభించగానే, సోషల్ మీడియాలో, ‘గుడ్‌రీడ్స్ కంపెనీని తట్టుకుని నిలబడగలదా ఈ ఆప్’ అని రకరకాలుగా విమర్శించారు. అందరి మాటలను పక్కకు పెట్టి ముందుకు దూకారు పద్మశ్రీ వారియర్. ‘‘ఇరవై సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన నేను నాకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను. ముందుగా నా గురించి నేను సరైన అంచనా వేసుకుంటాను. ఒక అధికారిగా నా నిర్ణయాల సక్రమంగా ఉండేలా ఆలోచిస్తాను’’ అంటారు పద్మశ్రీ వారియర్, ఫేబుల్ సంస్థ ద్వారా అత్యున్నత ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతున్నారు. ఉద్యోగాలలో స్త్రీపురుషులను సమానంగా చూడాలనే అంశం మీద గొంతెత్తుతారు. ‘అందమైన రేపటి కోసం మహిళలు ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు, మరింతమంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగాలని ఆశిస్తాను’ అంటారు.
అత్యంత ప్రతిభ..
విజయవాడలో పుట్టి పెరిగిన పద్మశ్రీ, ఢిల్లీ ఐఐటి నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బి.ఎస్., అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్. పూర్తి చేశారు. సాంకేతిక రంగంలో 2020లో అత్యంత ప్రతిభ చూపిన 50 మందిలో పద్మశ్రీ వారియర్‌ను ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. సాంకేతిక రంగంలో సంపాదించిన అనుభవంతో ఇప్పుడు ఫేబుల్స్ ఆప్‌ను ప్రారంభించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్నారు పద్మశ్రీ వారియర్. ‘ఫేబుల్ హ్యాజ్ స్టోరీస్ ఫర్ ఎవ్రీవన్, మై హోప్ ఈజ్ దట్ యు విల్ టేక్ ఎ డైలీ బ్రేక్ టు రీడ్ బికాజ్ యు ఆర్ వర్త్ ఇట్’ అంటున్నారు.
పద్మశ్రీ వారియర్
స్వయంగా ఎదగాలి
Published Sat, Aug 7 2021 1:44 AM | Last Updated on Sat, Aug 7 2021 1:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment