అవకాశాలను సృష్టించుకోవాలి!  | Veenas successful journey in the field of technology | Sakshi
Sakshi News home page

అవకాశాలను సృష్టించుకోవాలి! 

Published Wed, May 24 2023 2:38 AM | Last Updated on Wed, May 24 2023 2:41 AM

Veenas successful journey in the field of technology - Sakshi

‘డ్రీమ్‌ బిగ్, ఫాలో యువర్‌ పాషన్, వర్క్‌ హార్డ్, వర్క్‌ స్మార్ట్‌’... నాలుగు మాటలు. ఈ నాలుగు మాటలే వీణాగుండవెల్లిని విజేతగా నిలబెట్టాయి. ‘ఇలా ముందుకెళ్లమని నాకెవ్వరూ చెప్పలేదు.  స్వీయశోధన తో తెలుసుకున్న సత్యాలివి. కొత్తతరానికి నేను చెప్పగలిగిన సూచన ఇది. నేను ఆచరించిన మార్గమే నా సందేశం’ అన్నారామె. 

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌ చేసిన వీణ ఆ తర్వాత యూఎస్‌ వెళ్లి శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. యూఎస్‌లోని సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా ఇమాజియా సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నిర్వహిస్తున్న వీణ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సాంకేతిక రంగంలో విజయవంతమైన తన జర్నీని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. 
 
‘‘యూఎస్‌లో నేను కానన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్‌లో పని చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో సొంత కంపెనీ ప్రారంభించాను. ఇంటర్నెట్‌ మొదలైన రోజులు, అలాగే వైటూకే క్రైసిస్‌ ఎదురైన రోజులు కూడా. ఆ సమస్యలను అధిగమిస్తూ ఇంటర్నెట్‌ ఆధారిత ఫైనాన్స్‌ అప్లికేషన్స్‌ సర్వీసులందించింది మా సంస్థ. ఈ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్మాను, నా నమ్మకమే పునాదిగా ముందుకెళ్లాను.

ఒక దశ తరవాత కంపెనీ కార్యకలాపా లను విస్తరించాలనే ఉద్దేశంతో వెంచర్‌ క్యాపిటల్‌ ద్వారా ఫండ్‌ రైజింగ్‌ మొదలుపెట్టాను. మా కంపెనీ సేవల పట్ల నమ్మకం కలిగినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందడుగు వేయలేక΄ోయారు. అందుకు కారణం మహిళను కావడమే. నా మీద నాకు కాన్ఫిడెన్స్‌ ఉంది, నేను కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తున్నాను. ఆ మేరకు పెట్టుబడి పెట్టేవాళ్లలో విశ్వాసం కలిగించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి.

కష్టం అని వదిలిన వాళ్ల వెంట సక్సెస్‌ రాదు. కష్టాన్ని జయించడమే విజయానికి తొలిమెట్టు. మొత్తానికి నాకున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశ్వాసం కలిగిన తరవాత పెట్టుబడులు పెట్టారు. కానీ  ఆ తర్వాత ‘మీ కంపెనీలో మా ప్రతినిధి సీఈవో హోదాలో ఉంటారు. మీరు టెక్నాలజీ పా ర్ట్‌ చూసుకోండి’ అన్నారు. ఆ షరతును అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. టాప్‌లో ఉన్న మా కంపెనీ ఒడిదొడుకులకు లోనయింది. తిరిగి టాప్‌లో నిలపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. 
 
ముందుచూపు 
ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువైంది. మేము 2015లోప్రోడక్ట్‌ బిల్డ్‌ చేశాం. సాంకేతిక రంగానికి ఏఐని పరిచయం చేశామని చెప్పాలి. ఆ తర్వాత మూడేళ్లకు కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సహకారాన్ని డిజిటల్‌గా అందించడం మొదలుపెట్టాం. మరో రెండేళ్లలో ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్‌లను చదివి,  ప్రాజెస్‌ చేయగలిగిన తొలి ఏఐ ఇంజన్‌ను తీసుకొచ్చాం.

ఈ రంగంలో మేమిచ్చిన డైరెక్షన్‌ను ముందుచూపున్న కంపెనీలు అందుకున్నాయి. మేము ఏఐ ఆధారిత డిజిటల్‌ పేమెంట్స్‌ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు వేగంగా జరుగుతుంటే వ్యాపా రం కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఓటూసీ (ఆర్డర్‌ టూ కస్టమర్‌) ్రపా సెస్‌ని మా కంపెనీ చేస్తుంది. తొంభై దేశాల్లో, 25 భాషల్లో మా సేవలందింస్తున్నాం. 
 
భవిష్యత్తు దర్శనం
విజేత కావాలంటే భవిష్యత్తును దర్శించగలగాలి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడమనేది పా త మాట. అవకాశాలను సృష్టించుకోవాలనేది ఈ జనరేషన్‌ అనుసరించాల్సిన ఫార్ములా. హెన్రీ ఫోర్డ్‌ ఒక ఇంజనీర్‌గా మిగిలిపోలేదు. తన ఆలోచనతో రవాణాకు యంత్రంతో నడిచే కారు అనే వాహనానికి రూపకల్పన చేసి పా రిశ్రామికవేత్త అయ్యాడు.

గుర్రం మీద ప్రయాణించే కాలాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మన ఆలోచన సమాజానికంటే ముందుండాలి. అది శతాబ్దం కావచ్చు, దశాబ్దం కావచ్చు. ఆ సమయానికి సమాజం మన ఆలోచనను స్వాగతించవచ్చు లేదా విమర్శించనూ వచ్చు. కానీ దానిని నిరూపించిన తరవాత మన వెంట నడిచి తీరుతుంది’’ అన్నారు వీణా గుండవెల్లి. 

ఆమె తన విజయాలనే పా ఠ్యాంశాలుగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారికి సహాయం చేయడానికి టచ్‌ ఏ లైఫ్‌ పేరుతో ఒక ఫౌండేషన్‌ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనం చేకూరే స్టార్టప్‌లతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమెను వరించిన అవార్డుల ప్రస్తావనకు ఆమె ‘ఎన్నని చెప్పాలి, అయినా ఆ లెక్క ఇప్పుడెందుకు’ అన్నారు నవ్వుతూ. 


– వాకా మంజులారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement