2025లో వృద్ధి బాటలోనే దేశీ ఐటీ
20 శాతం పెరగనున్న ఉద్యోగాలు
ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో నెహ్రా వెల్లడి
ముంబై: కొత్త సాంకేతికతల దన్నుతో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం నూతన సంవత్సరంలోనూ జోరుగా వృద్ధి బాటలో ముందుకు సాగనుంది. 2025లో కొత్త ఉద్యోగాల కల్పన 20 శాతం పెరగనుంది. మానవ వనరుల సేవల సంస్థ ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో (ఐటీ స్టాఫింగ్) సునీల్ నెహ్రా ఈ విషయాలు తెలిపారు. డిజిటల్ పరివర్తన వేగవంతం కావడం, కొత్త సాంకేతికతల్లో నైపుణ్యాలున్న వారికి డిమాండ్ పెరగడం వంటి అంశాల కారణంగా 2024లో దేశీ ఐటీ, టెక్ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు 17 శాతం పెరిగినట్లు చెప్పారు.
కొత్త సంవత్సరంలోనూ పరిశ్రమ వృద్ధి మరింత పుంజుకోగలదని పేర్కొన్నారు. అప్లికేషన్ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డెవాప్స్ ఇంజినీర్లు, ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నిపుణులకు ఉద్యోగావకాశాలు బాగుంటాయని నెహ్రా చెప్పారు. 2024లో ప్రధాన ట్రెండ్‌గా నిల్చిన కృత్రిమ మేథ (ఏఐ) 2025లో కూడా మరింత వేగవంతమవుతుందన్నారు. డేటా అనలిస్టులు, డేటా ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు తదితర నిపుణులకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.
జెన్–ఏఐలో పది లక్షల అవకాశాలు..
2028 నాటికి జెనరేటివ్ ఏఐ (జెన్–ఏఐ) పరిశ్రమలో 10 లక్షలకు పైగా కొత్త కొలువులు వస్తాయని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి ఇది గణనీయంగా తోడ్పడగలదని నెహ్రా తెలిపారు. జెనరేటివ్ ఏఐ ఇంజినీర్, అల్గోరిథం ఇంజినీర్, ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలకు వేతనాలు గణనీయంగా పెరగవచ్చని పేర్కొన్నారు. మిడ్–లెవెల్ ఉద్యోగులకు వేతన వృద్ధి 25–30 శాతం శ్రేణిలో ఉంటుందని వివరించారు.
వ్యాపారాలు వృద్ధి చెందుతూ, కొత్త ఆవిష్కరణలు చేసే కొద్దీ నూతన ప్రాజెక్టుల కోసం హైరింగ్ చేసుకోవడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకునేందుకు పోటీపడటం మొదలైన ధోరణులు పెరుగుతాయని తెలిపారు. 2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో (జీసీసీ) 6,00,000 ఉద్యోగాలు వచ్చినట్లు నెహ్రా చెప్పారు. 2030 నాటికి ఈ నిపుణుల సంఖ్య 25 లక్షల నుంచి 28 లక్షల వరకు పెరుగుతుందన్నారు.
మరిన్ని విశేషాలు..
⇒ 2025లో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్), టెలికం వంటి టెక్‌యేతర రంగాల్లో కూడా ఐటీ/టెక్నాలజీ నిపుణుల నియామకాలు పెరుగుతాయి. మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి సంస్థల వరకు చాలా మటుకు కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు కేటాయించే బడ్జెట్లు సగటున 15–20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. అంతేగాకుండా ఉద్యోగులు సైతం కొత్త తరం టెక్ కొలువులకు కావాల్సిన నైపుణ్యాలను సాధించేందుకు తమంతట తాముగా కూడా చొరవ తీసుకుంటారు.
⇒ దేశీ ఐటీలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 2.4 కోట్ల స్థాయికి చేరుతుంది. టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న అవసరాలను పరిష్కరించుకునేందుకు, కావాల్సినప్పుడు అందుబాటులో ఉండే వర్కర్లపై ఆధారపడే ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం.
⇒ భారతీయ ఐటీ రంగం చాలా మటుకు స్థిరపడినప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి వర్ధమాన రంగాల్లో నిపుణుల కొరత ఉంటోంది. అలాగే, అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరత ప్రభావం కూడా మన ఐటీ రంగంపై పడతోంది.
⇒ డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియాలాంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగానే ఉంటున్నాయి. కానీ, వ్యయాలపరంగా ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు, కస్టమర్లకు మరింత విలువైన సేవలు అందించేందుకు వినూత్న వ్యూహాలు అవసరమవుతాయి. సాంకేతిక పరివర్తనకు సంబంధించి మరింతగా ముందుకెళ్లేందుకు ఇవి కీలకంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment