రుణాలపై సలహాలకు.. క్రెడిట్ అనలిస్ట్
రుణం కోసం బ్యాంకును ఆశ్రయిస్తే... మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి, మీకు రుణం మంజూరు చేయాలా? చేయొద్దా? ఒకవేళ చేస్తే ఎంతమేరకు ఇవ్వొచ్చు అనేది తేల్చిచెప్పే నిపుణులు అక్కడ ఉంటారు. వారే.. క్రెడిట్ అనలిస్ట్‌లు. వీరు రుణ దాతలు, గ్రహీతలకు మధ్య వారధిగా పనిచేస్తుంటారు. కార్పొరేట్ యుగంలో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం అనేవి సర్వసాధారణంగా మారాయి. అందుకే క్రెడిట్ అనలిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. ఆర్థికాంశాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని తమ కెరీర్‌గా మార్చుకుంటే బ్రహ్మాండమైన అవకాశాలు, భారీ ఆదాయం సొంతం చేసుకోవచ్చు.
సొంత ఏజెన్సీతో ఆదాయం పుష్కలం
క్రెడిట్ విశ్లేషకులకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీఓ) రంగాల్లో కొలువులు దక్కుతున్నాయి. ఆసక్తి, అనుభవం ఉంటే సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకొనే అవకాశం కూడా ఉంది. దీంతో పనితీరును బట్టి అధిక ఆదాయం పొందొచ్చు. కార్పొరేట్ సంస్థలు తమకు కావాల్సిన రుణం కోసం బ్యాంకుల తలుపు తడుతుంటాయి.
తమకు ఏ మేరకు రుణం అందుతుందో ముందే తెలుసుకోవడానికి క్రెడిట్ అనలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కంపెనీ బ్యాలన్స్ షీట్లు, ఫైనాన్షియల్ డేటా, న్యూస్ రిపోర్టులను పరిశీలించి తగిన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కంపెనీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలి. వ్యక్తులు కూడా రుణానికి సంబంధించిన సలహాల కోసం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి రంగంలో క్రెడిట్ అనలిస్ట్‌ల అవసరం ఉంటోంది.
కావాల్సిన నైపుణ్యాలు: క్రెడిట్ అనలిస్ట్‌లకు మెరుగైన క్వాంటిటేటివ్, అనలిటికల్, ఆర్గనైజేషనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆంగ్ల పరిజ్ఞానం అవసరం. ఇంగ్లిష్‌లో రిపోర్ట్ రైటింగ్, ప్రజంటేషన్లను రూపొందించగలగాలి. ఈ వృత్తిలో డెడ్లైన్లు, ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే నేర్పు ఉండాలి. వృత్తిపరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి.
అర్హతలు: ఎంబీఏ పూర్తిచేస్తే క్రెడిట్ అనలిస్ట్‌గా మారొచ్చు. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ సబ్జెక్టులు చదివినా ఎంబీఏ చేయొచ్చు.
అయితే, క్వాంటిటేటివ్, అనలిటికల్ స్కిల్స్ పెంచే సబ్జెక్టులు చదివితే ఈ రంగంలో సులువుగా రాణించడానికి వీలుంటుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు బీటెక్, బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్హతలను కూడా కోరుకుంటున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చదివినవారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ లాంటి సర్టిఫికేషన్లను అభ్యసించి అర్హతలు, నైపుణ్యాలను పెంచుకోవాలి.
వేతనాలు: క్రెడిల్ అనలిస్ట్‌లకు వేతనాలు అధికంగా ఉంటాయి. పేరొందిన కంపెనీలో చేరితే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ అందుకోవచ్చు. అనుభవం పెరిగేకొద్దీ ఈ ప్యాకేజీ బరువు కూడా పెరుగుతుంది. సంతృప్తికరమైన పనితీరు, ప్రతిభాపాటవాలతో సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) లేదా మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) స్థాయికి చేరుకోవచ్చు. పీజీ డిగ్రీ ఉండి, వృత్తిలో 20 ఏళ్ల అనుభవం కలిగిన సీఈఓకు ఏడాదికి రూ.40 లక్షలకు పైగా వేతన ప్యాకేజీ ఉంటుంది.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)- అహ్మదాబాద్.
వెబ్సైట్: www.iimahd.ernet.in
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- బెంగళూరు. వెబ్సైట్: www.iimb.ernet.in
- యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
వెబ్సైట్: www.du.ac.in/du
- డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ
వెబ్సైట్: www.iitd.ac.in
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
వెబ్సైట్: www.icai.org
- జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్
వెబ్సైట్: www.xlri.ac.in