
ముంబై: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ–ఐఎఫ్‌సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) మౌలిక రంగం ప్రాజెక్టులకు ఇచ్చిన రుణం అంతంతేనని ఇక్రా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణమని సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. అయితే మౌలిక రంగం పరోగతిపై సమీప భవిష్యత్తులో ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని మధ్య కాలికంగా ఈ విభాగం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
- 2021 మర్చి 31 నాటికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ–ఐఎఫ్‌సీలు కలిసి మౌలిక రంగానికి ఇచ్చిన రుణ అంచనా రూ.24.7 లక్షల కోట్లు. 2020 ఇదే కాలంతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ. జూన్ 30 వరకూ మౌలిక రంగానికి రుణ పరిమాణం బలహీనంగానే ఉంది. కరోనా సెకండ్‌వేవ్ ప్రేరిత సవాళ్లు దీనికి ప్రధాన కారణం.
- ఒక్క ఐఎఫ్‌సీల విషయంలో మౌలిక రంగానికి గత ఐదేళ్లలో రుణం పెరుగుతోంది. 2021మార్చి 31 వతేదీ నాటికి 54 శాతం పురోగమించింది. అయితే బ్యాంకుల షేర్ గడచిన ఐదేళ్లలో 61 శాతం నుంచి నుంచి 46శాతానికి పడిపోయింది.
- 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2024– 2025 ఆర్థిక సంవత్సరం వరకూ నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ) కింద రూ.111 లక్షల కోట్లకు పైగా మౌలిక రంగం పెట్టుబడులపై కేంద్రం దృష్టి సారించడం ఈ రంగానికి భవిష్యత్ సానుకూల అంశాల్లో కీలకమైనది.
- ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ–ఐఎఫ్‌సీల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితులు బాగున్నాయి. స్వల్ప కాలిక రుణాలకు సంబంధించి లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడ్డాయి.
- ఒక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీల విషయానికి వస్తే, ప్రభుత్వ రంగంలో సంస్థలు లాభాల బాటకు మళ్లాయి. మొండిబకాయిల (ఎన్‌పీఏ) వాటా తగ్గింది. రుణ వ్యయాలు తక్కువగా ఉన్నాయి.
- ఎన్‌బీఎఫ్‌సీ–ఐఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగుదల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.