ముంబై: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌కు ముందున్న 141.2 మిలియన్ స్థాయిలను అధిగమిస్తుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. 8–13 శాతం వృద్ధితో ప్రయాణికుల సంఖ్య 2023–24లో 150–155 మిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ, సాపేక్షంగా స్థిర వ్యయ వాతావరణంలో కొనసాగుతున్న పునరుద్ధరణ మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై స్థిర దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
ఇక్రా నివేదిక ప్రకారం.. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలలో పరిశ్రమ నికర నష్టంలో గణనీయ తగ్గింపు నమోదు చేయనుంది. సరఫరా సంబంధ సవాళ్లు, ఇంజిన్ వైఫల్య సమస్యలతో సమీప కాలానికి ఎదురుగాలి ఉండవచ్చు. ట్రాఫిక్ వృద్ధిలో ఊపు 2024–25లో కూడా కొనసాగుతుంది. యాత్రలు, వ్యాపార ప్రయాణాలకు డిమాండ్ పెరగడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం వంటివి ఈ జోరుకు సహాయపడతాయి.
గణనీంగా తగ్గనున్న నష్టాలు..
భారతీయ విమానయాన సంస్థల ద్వారా 2022–23లో నమోదైన విదేశీ ప్రయాణికుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయిలను అధిగమించింది. 2018–19లో ఇది 25.9 మిలియన్ల గరిష్ట స్థాయిలను తాకింది. 7–12 శాతం వృద్దితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–27 మిలియన్లు, 2024–25లో 27–29 మిలియన్లకు చేరవచ్చు.
పరిశ్రమ మెరుగైన ధరల పెరుగుదలను చూడడంతో ఆదాయాల్లో వృద్ధి నమోదైంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో క్షీణత, సాపేక్షంగా స్థిరంగా ఉన్న విదేశీ మారకపు రేట్ల కారణంగా రాబోయే రోజుల్లోనూ ఇది అనుకూలంగా ఉంటుంది. పరిశ్రమ నష్టాలు 2022–23 స్థాయి రూ.17,000–17,500 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000–4,000 కోట్లకు చేరవచ్చు. ఏటీఎఫ్ ధరలు, భారతీయ రూపాయి–యూఎస్ డాలర్ కదలికలు ఎయిర్‌లైన్స్ వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఏటీఎఫ్ ధర 2022–23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో 15 శాతం క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment