Domestic air passengers
-
ముప్పై కోట్లకు విమాన ప్రయాణికులు! ఎప్పటి వరకంటే..
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి (2030) దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు సుమారు 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (జీఐఎఫ్ఏఎస్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా 157 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌డ్రోమ్‌లు ఉన్నాయని చెప్పారు. వినియోగంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 2025 ఆఖరు నాటికి 200కి పెరగవచ్చని పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ అనుకూల విమాన ఇంధన సరఫరా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంపై భారత్, ఫ్రాన్స్ కలిసి పని చేయొచ్చని ఆయన తెలిపారు. ఎయిర్‌బస్ భారత మార్కెట్ నుంచి విడిభాగాల కొనుగోళ్లను మరింతగా పెంచుకోనున్నట్లు ఎయిర్‌బస్ సీఈవో గిలామీ ఫారీ తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో భారత్ నుంచి సరీ్వసులు, విడిభాగాల కొనుగోళ్లను రెట్టింపు స్థాయిలో 1 బిలియన్ యూరోలకు పెంచుకున్నట్లు వివరించారు. తమకు ఇక్కడ 100కు పైగా సరఫరాదారులు ఉన్నట్లు జీఐఎఫ్ఏఎస్లో పాల్గొన్న సందర్భంగా ఫారీ చెప్పారు. జీఐఎఫ్ఏఎస్లో భాగమైన కంపెనీలు భారత్ నుంచి ఏటా 2 బిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌కు 8,600 విమానాల ఆర్డర్ బుక్ ఉండగా, ఈ ఏడాది 770 ప్లేన్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దేశీయంగా ఇండిగో, ఎయిరిండియా కలిసి 1,000కి పైగా విమానాల కోసం ఆర్డరు ఇచ్చాయి. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్ ఇండియా, 60.7 శాతంతో స్పైస్‌జెట్ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ మార్కెట్ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది. -
విమాన ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి
ముంబై: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌కు ముందున్న 141.2 మిలియన్ స్థాయిలను అధిగమిస్తుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం తెలిపింది. 8–13 శాతం వృద్ధితో ప్రయాణికుల సంఖ్య 2023–24లో 150–155 మిలియన్లకు చేరుకుంటుందని వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ, సాపేక్షంగా స్థిర వ్యయ వాతావరణంలో కొనసాగుతున్న పునరుద్ధరణ మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై స్థిర దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఇక్రా నివేదిక ప్రకారం.. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలలో పరిశ్రమ నికర నష్టంలో గణనీయ తగ్గింపు నమోదు చేయనుంది. సరఫరా సంబంధ సవాళ్లు, ఇంజిన్ వైఫల్య సమస్యలతో సమీప కాలానికి ఎదురుగాలి ఉండవచ్చు. ట్రాఫిక్ వృద్ధిలో ఊపు 2024–25లో కూడా కొనసాగుతుంది. యాత్రలు, వ్యాపార ప్రయాణాలకు డిమాండ్ పెరగడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం వంటివి ఈ జోరుకు సహాయపడతాయి. గణనీంగా తగ్గనున్న నష్టాలు.. భారతీయ విమానయాన సంస్థల ద్వారా 2022–23లో నమోదైన విదేశీ ప్రయాణికుల రద్దీ కోవిడ్ ముందస్తు స్థాయిలను అధిగమించింది. 2018–19లో ఇది 25.9 మిలియన్ల గరిష్ట స్థాయిలను తాకింది. 7–12 శాతం వృద్దితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–27 మిలియన్లు, 2024–25లో 27–29 మిలియన్లకు చేరవచ్చు. పరిశ్రమ మెరుగైన ధరల పెరుగుదలను చూడడంతో ఆదాయాల్లో వృద్ధి నమోదైంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలలో క్షీణత, సాపేక్షంగా స్థిరంగా ఉన్న విదేశీ మారకపు రేట్ల కారణంగా రాబోయే రోజుల్లోనూ ఇది అనుకూలంగా ఉంటుంది. పరిశ్రమ నష్టాలు 2022–23 స్థాయి రూ.17,000–17,500 కోట్ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000–4,000 కోట్లకు చేరవచ్చు. ఏటీఎఫ్ ధరలు, భారతీయ రూపాయి–యూఎస్ డాలర్ కదలికలు ఎయిర్‌లైన్స్ వ్యయ నిర్మాణంపై ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఏటీఎఫ్ ధర 2022–23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో 15 శాతం క్షీణించింది. -
1.16 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 నవంబర్‌లో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య 11.06 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. 2022 అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది విహంగ వీక్షణం చేశారు. కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత.. దేశంలోని పౌర విమానయాన రంగం రికవరీ బాటలో ఉంది. ఇటీవలి కాలంలో దేశీయంగా సగటున ప్రతిరోజు 4 లక్షల పైచిలుకు మంది విమాన ప్రయాణం చేస్తున్నారు. నవంబరులో నమోదైన మొత్తం ప్రయాణికుల్లో 55.7 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో నిలిచింది. విస్తారా 9.3 శాతం వాటాతో 10.87 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. ఎయిర్ ఇండియా 9.1 శాతం, ఏయిర్‌ఏషియా ఇండియా 7.6, గో ఫస్ట్, స్పైస్‌జెట్ చెరి 7.5 శాతం వాటాను దక్కించుకున్నాయి. టాటా గ్రూప్ కంపెనీలైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ఏషియా సంయుక్తంగా 26 శాతం వాటాతో 30.35 లక్షల మందికి విమాన సేవలు అందించాయి. 92 శాతం అధిక ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ ముందంజలో ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో రాకపోకల విషయంలో సగటున 92 శాతం ఇండిగో విమానాలు నిర్ధేశిత సమయానికి సేవలు అందించాయి. -
విమానాల్లో చక్కర్లు.. భారీగా పెరిగిన ప్రయాణికులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 మే నెలలో 1.20 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 మే నెలతో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం కావడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం..గతేడాది దేశీయంగా మే నెలలో 21 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. 1.20 కోట్లలో ఇండిగో విమానాల ద్వారా 70 లక్షల మంది విహంగ విహారం చేశారు. మొత్తం ప్రయాణికుల్లో ఇది 57.9 శాతం. గో ఫస్ట్ ద్వారా 12.76 లక్షల మంది రాకపోకలు సాగించారు. -
జనవరిలో తగ్గిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత నెలలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత డిసెంబర్లో మొత్తం 1.12 కోట్ల మంది ప్రయాణించగా.. జనవరిలో 43 శాతం తక్కువగా 64.08 లక్షల మంది విమాన సేవలను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలను పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విడుదల చేసింది. స్పైస్‌జెట్ లోడ్ ఫ్యాక్టర్ (ప్రయాణికుల భర్తీ) 73.4 శాతంగా ఉంది. ఇండిగో 66.6 శాతం, విస్తారా 61.6 శాతం, గోఫస్ట్ 66.7శాతం. ఎయిర్ ఇండియా 60.6 శాతం, ఎయిరేషియా 60.5 శాతం చొప్పున లోడ్ ఫ్యాక్టర్ సాధించాయి. ఇండిగో అత్యధికంగా 35.57 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. దేశీయంగా 55.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్‌జెట్ 6.8 లక్షల మంది, ఎయిర్ ఇండియా (6.56 లక్షలు), గోఫస్ట్ (6.35 లక్షలు), విస్తారా (4.79 లక్షలు), ఎయిరేషియా ఇండియా (2.95 లక్షలు), అలియన్స్ ఎయిర్ 0.80 లక్షల మంది చొప్పున ప్రయాణికులను తీసుకెళ్లాయి. మెట్రో నగరాల నుంచి 94.5 శాతం మేర సకాలంలో విమాన సేవలను అందించి గో ఫస్ట్ ముందుంది. ఇండిగో 93.9 శాతం, విస్తారా 93.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో 66 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 31 శాతం అధికమని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘ప్రయాణికుల సంఖ్య పరిమితి అధికమవడం, మహమ్మారి తగ్గుముఖం పట్టడం ఈ పెరుగుదలకు కారణం. జూలైలో దేశీయంగా 51 లక్షల మంది వివిధ నగరాలను చుట్టి వచ్చారు. 2020 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో ప్రయాణికుల సంఖ్య 131 శాతం అధికమైంది. గతేడాది ఈ కాలంలో 28.3 లక్షల మంది ప్రయాణం చేశా రు. ఆగస్ట్‌లో కోలుకోవడం జరిగినప్పటికీ సె కండ్ వేవ్ కారణంగా డిమాండ్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. కస్టమర్లు అవసరమైతే మాత్రమే ప్రయాణిస్తున్నారు’ అని ఇక్రా తెలిపింది. అధికమైన సరీ్వసులు.. దేశవ్యాప్తంగా 2021 ఆగస్ట్‌లో 57,500 విమాన సరీ్వసులు నడిచాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 28,834 మాత్రమే. ఈ ఏడాది జూలైతో పోలిస్తే గత నెలలో 22 శాతం పెరుగుదల. ఆగస్ట్‌లో సగటున 1,900 సరీ్వసులు నమోదయ్యాయి. 2020 ఆగస్ట్‌లో ఇది 900 మాత్రమే. 2021 జూలైలో ఈ సంఖ్య 1,500 ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సగటున రోజుకు 2,000 సరీ్వసులు నడవడం గమనార్హం. ఆగస్ట్‌లో ఒక్కో విమానంలో సగటున 114 మంది ప్రయాణించారు. జూలైలో ఈ సంఖ్య 106 ఉంది. ఇక విమాన టికెట్ల ధరలను ఆగస్ట్ 12–31 మధ్య 10–13 శాతం పెంచేందుకు పౌర విమానయాన శాఖ అనుమతిచి్చంది’ అని ఇక్రా వివరించింది. -
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న విమాన ఛార్జీలు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు చెల్లించే ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఎ.ఎస్.ఎఫ్) ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న నేపథ్యంలో విమాన ఛార్జీలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతం దేశీయ ప్రయాణికులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు రూ.160 నుంచి రూ.200కు, అంతర్జాతీయ ప్రయాణీకులు చెల్లించే ఎ.ఎస్.ఎఫ్ ఫీజు 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2021 నుంచి విమాన టిక్కెట్లపై వర్తిస్తాయి. గత రెండు నెలలుగా జెట్ ఇంధన ధరలు పెరగడంతో విమాన చార్జీలు ఇప్పటికే 30 శాతం పెరిగిన నేపథ్యంలో తాజాగా మరోసారి చార్జీలు పెరగడంతో గగన విహారం భారం కానుంది. ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జారీ చేసిన ఉత్తర్వులలో.. వివిధ వర్గాలలో ఉన్న కొద్దిమంది ప్రయాణీకులకు ఈ రుసుము చెల్లింపు విషయంలో మినహాయింపు ఉంది. వీరిలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు, వైమానిక సిబ్బంది, ఒకే టికెట్‌పై కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణీకులకు ఈ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని మార్చి 31, 2021 నుంచి 2021 ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు పొడగించినట్లు గమనించాలి. అయితే, ఇది కార్గో విమానాలకు, డీజీసీఏ ఆమోదించిన వాటికి వర్తించదు. చదవండి: ఎలోన్ మస్క్ టెస్లా విషయంలో కీలక నిర్ణయం! వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండిలా! -
జెట్ ఎయిర్వేస్ చార్జీల డిస్కౌంట్ ఆఫర్
ముంబై: దేశీ విమాన ప్రయాణికుల కోసం జెట్ ఎయిర్వేస్ చార్జీల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు తమ టిక్కెట్లను దాదాపు 90 రోజులు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. ఈ టిక్కెట్ ధరలు రూ.1,933 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ టిక్కెట్లతో ప్రయాణికులు జూలై 1 నుంచి జెట్ ఎయిర్వేస్ విమానాలలో ప్రయాణించ వచ్చు. ఢిల్లీ-ముంబై ప్రయాణపు టిక్కెట్ ధర రూ. 3,004, బెంగళూరు-ముంబై ప్రయాణపు టిక్కెట్ ధర రూ. 2,459గా ఉంది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి 30-50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.