న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత నెలలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత డిసెంబర్‌లో మొత్తం 1.12 కోట్ల మంది ప్రయాణించగా.. జనవరిలో 43 శాతం తక్కువగా 64.08 లక్షల మంది విమాన సేవలను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలను పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విడుదల చేసింది. స్పైస్‌జెట్ లోడ్ ఫ్యాక్టర్ (ప్రయాణికుల భర్తీ) 73.4 శాతంగా ఉంది. ఇండిగో 66.6 శాతం, విస్తారా 61.6 శాతం, గోఫస్ట్ 66.7శాతం. ఎయిర్ ఇండియా 60.6 శాతం, ఎయిరేషియా 60.5 శాతం చొప్పున లోడ్ ఫ్యాక్టర్ సాధించాయి.
ఇండిగో అత్యధికంగా 35.57 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. దేశీయంగా 55.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్‌జెట్ 6.8 లక్షల మంది, ఎయిర్ ఇండియా (6.56 లక్షలు), గోఫస్ట్ (6.35 లక్షలు), విస్తారా (4.79 లక్షలు), ఎయిరేషియా ఇండియా (2.95 లక్షలు), అలియన్స్ ఎయిర్ 0.80 లక్షల మంది చొప్పున ప్రయాణికులను తీసుకెళ్లాయి. మెట్రో నగరాల నుంచి 94.5 శాతం మేర సకాలంలో విమాన సేవలను అందించి గో ఫస్ట్ ముందుంది. ఇండిగో 93.9 శాతం, విస్తారా 93.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment