2030 నాటికి కేంద్రం అంచనాలు
ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై 11 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి (2030) దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు సుమారు 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (జీఐఎఫ్‌ఏఎస్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
అత్యంత వేగంగా ఎదుగుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా 157 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌డ్రోమ్‌లు ఉన్నాయని చెప్పారు. వినియోగంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 2025 ఆఖరు నాటికి 200కి పెరగవచ్చని పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ అనుకూల విమాన ఇంధన సరఫరా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంపై భారత్, ఫ్రాన్స్ కలిసి పని చేయొచ్చని ఆయన తెలిపారు.
ఎయిర్‌బస్
భారత మార్కెట్ నుంచి విడిభాగాల కొనుగోళ్లను మరింతగా పెంచుకోనున్నట్లు ఎయిర్‌బస్ సీఈవో గిలామీ ఫారీ తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో భారత్ నుంచి సరీ్వసులు, విడిభాగాల కొనుగోళ్లను రెట్టింపు స్థాయిలో 1 బిలియన్ యూరోలకు పెంచుకున్నట్లు వివరించారు. తమకు ఇక్కడ 100కు పైగా సరఫరాదారులు ఉన్నట్లు జీఐఎఫ్‌ఏఎస్‌లో పాల్గొన్న సందర్భంగా ఫారీ చెప్పారు. జీఐఎఫ్‌ఏఎస్‌లో భాగమైన కంపెనీలు భారత్ నుంచి ఏటా 2 బిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌కు 8,600 విమానాల ఆర్డర్ బుక్ ఉండగా, ఈ ఏడాది 770 ప్లేన్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దేశీయంగా ఇండిగో, ఎయిరిండియా కలిసి 1,000కి పైగా విమానాల కోసం ఆర్డరు ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment