2026 జూన్ నాటికి ఏపీలోని భోగాపురం విమానాశ్రయం సిద్ధం
త్వరలో దేశవ్యాప్తంగా మరో 50 విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
శంషాబాద్‌లో ఏఐ ఆధారిత ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో విమానాశ్రయానికి అదనంగా కావాల్సిన 250 ఎకరాల భూమి భారత ఎయిర్‌పోర్ట్ అథారిటీకి బదిలీ కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగంగానే నిర్వహిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన నెక్ట్స్ జనరేషన్ ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన విమానాశ్రయాల్లో తొలుత వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఏపీలోని భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
బెదిరింపు కాల్స్‌పై చర్యలకు చట్ట సవరణ
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ కాల్స్ చేస్తున్న ఘటనలు తీవ్రమైన నేపథ్యంలో, అలాంటి ఫోన్‌కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. ఫేక్ కాల్స్ విమాన ప్రయాణాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వారికి జైలు శిక్షతోపాటు జీవితాంతం విమానాల్లో ప్రయాణించే వీలు లేకుండా చట్టాన్ని సవరించాలని యోచిస్తున్నామని చెప్పారు.
ఇందుకు భారత పౌరవిమానయాన చట్టం 1982కు సవరణలు ప్రతిపాదించామని, దీనిపై మంత్రివర్గ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోందని, అభిప్రాయ సేకరణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు
పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 158కి పెరిగిందని, మరో 50 విమా నాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ‘పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రస్తుతం దేశంలో ఉన్న 800 విమానాలకు అదనంగా మరో 1,100 విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మన విమానాశ్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో 5.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
గత ఏడాది ఇదే నెలలో 1.26 కోట్ల మంది విమాన ప్రయాణం చేయగా, ఆ సంఖ్య ఈ ఏడాది అదే నెలలో 1.36 కోట్లుగా నమోదైంది’అని పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల భద్రత, సులభతర ప్రయాణ ఏర్పాట్లు, అన్నిచోట్ల జాప్యాన్ని నివారించటమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ భారత విమానయాన రంగంలో ఓ మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు.
జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సౌత్‌చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కిషోర్ మాట్లాడుతూ ఏఐ ఆధారితంగా పనిచేసే కొత్త కేంద్రం ఇటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచటంతోపాటు వారికి మెరుగైన ప్రయాణ అనూభూతిని కలిగిస్తుందన్నారు. 40 రకాల అంశాలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఆధారంగా మానిటర్ చేసే వేగంగా, తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని ఏరకంగానూ ప్రయాణ సమయంలో అనవసరపు జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
ఈ వ్యవస్థను జీఎమ్మార్ విమానాశ్రయాలన్నింటిలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. జీఎమ్మార్ గ్రూపు విమానాశ్రయ విభాగ చైర్మన్ జీబీఎస్ రాజు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వాల్నమ్, జీఎమ్మార్ విమానాశ్రయ ప్రతినిధులు శ్రీనివాస్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు, కొత్తగా ప్రారంభించిన కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కేంద్రమంత్రి వెంట రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment