ఆ తర్వాత స్థానంలో ముంబై, బెంగళూరు
వేగంగా పెరుగుతున్న ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్ల సంఖ్య
ప్యాసింజర్ల సంఖ్యలో దేశంలోనే 4వ స్థానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యా పరంగా దేశంలోనే 4వ స్థానంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్ త్వరలోనే తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం వరకూ చూస్తే నగరం నుంచి ఢిల్లీకి అత్యధికంగా 14.6 శాతం మంది, ముంబైకి 10.8 శాతం మంది, బెంగళూరుకు 10 శాతం మంది రాకపోకలు సాగించినట్టు వెల్లడించింది.
మనకు నాలుగో స్థానం...
మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ 1,10,61,929 మంది ప్రయాణికులతో దేశంలోనే అత్యధిక సంఖ్యలో రాకపోకలు సాగించిన ఎయిర్‌పోర్ట్స్‌లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత 4వ స్థానం దక్కించుకుంది. అయితే 10.9 శాతం పెరుగుదలతో శరవేగంగా బిజీగా మారుతున్న ఎయిర్‌పోర్ట్స్‌లో నగరం ఒకటిగా నిలుస్తోంది.
ట్రాఫిక్ హీట్ పుట్టించిన మే...
ఈ ఏడాది తొలి అర్ధభాగం అత్యధిక ట్రాఫిక్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చవిచూసింది. అందులోనూ గత మే నెలలో ప్రయాణికుల రద్దీ అత్యధికంగా కనిపించింది. సంఖ్యాపరంగా చూస్తే జనవరి నెలలో 1.802 మిలియన్, ఫిబ్రవరిలో 1.730 మిలియన్, మార్చిలో 1.861 మిలియన్, ఏప్రిల్‌లో 1.858 మిలియన్, మేలో 1.971 మిలియన్, జూన్‌లో 1.841 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
ఢిల్లీకే ఎక్కువ...
నగరం నుంచి ఇతర నగరాలకు రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉండగా అందులో తొలిస్థానం ఢిల్లీకి దక్కింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఢిల్లీకి 16,14,660 మంది, ముంబైకి 11,97,952
మంది, బెంగళూరుకు 11,11,649 మంది రాకపోకలు సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment