కరోనా ముందస్తు స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌! | Overall electricity demand at 96-98 percent of pre-Covid level | Sakshi
Sakshi News home page

కరోనా ముందస్తు స్థాయికి విద్యుత్‌ డిమాండ్‌!

Published Thu, Sep 3 2020 6:32 AM | Last Updated on Thu, Sep 3 2020 6:32 AM

Overall electricity demand at 96-98 percent of pre-Covid level - Sakshi

ముంబై: దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సంకేతంగా విద్యుత్‌ డిమాండ్‌ క్రమంగా పుంజుకుని కరోనా ముందస్తు స్థాయికి చేరుతోంది. ఇండియా రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా బుధవారం ఈ మేరకు తన తాజా నివేదికను వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని నివేదిక విశ్లేషించింది. అయితే పారిశ్రామిక రంగంలో ఇంకా డిమాండ్‌ ధోరణులు కనిపించడం లేదని కూడా పేర్కొంది.  కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► అఖిల భారత స్థాయిలో చూస్తే, వార్షికంగా  2020 జూలైలో 6 నుంచి 13% విద్యుత్‌ డిమాండ్‌ రికవరీ నమోదయ్యింది. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో డిమాండ్‌ మెరుగుదల దీనికి నేపథ్యం. దీనికితోడు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ కూడా క్రమంలో పుంజుకుంటోంది.  

► ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే, జూలైలో భారీ పారిశ్రామిక రాష్ట్రాల విద్యుత్‌ డిమాండ్‌ 6 నుంచి 15 శాతం తక్కువగానే ఉంది. పారిశ్రామిక రంగంలో క్రియాశీలత నెమ్మదిగా ఉండడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.  

► లాక్‌డౌన్‌ తరవాత మొదటి నాలుగు నెలల్లో దేశ వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ 13.1 శాతం పడిపోయింది.  మార్చి 25 నుంచీ దేశంలో కఠిన లాక్‌డౌన్‌ అమలు సంగతి తెలిసిందే.

► నెలవారీగా చూస్తే, 2020 ఏప్రిల్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 85 బిలియన్‌ యూనిట్లగా ఉంటే, జూలైలో ఇది 112 బిలియన్‌ యూనిట్లకు చేరింది. అయితే వార్షికంగా చూస్తే మాత్రం డిమాండ్‌ ఇంకా మెరుగుపడాల్సి ఉంది.  

► 2020 ఏప్రిల్‌లో గరిష్ట డిమాండ్‌ 133 గిగావాట్లయితే జూలైలో ఇది 171 గిగావాట్లకు రికవరీ అయ్యింది. అయితే 2019 జూలైతో పోల్చితే ఇది ఇంకా 3.3 శాతం తక్కువే కావడం గమనార్హం.  

►  ఇక ఆగస్టు విషయానికి వస్తే, కోవిడ్‌–19 ముందస్తు స్థాయితో పోల్చితే 98 శాతానికి విద్యుత్‌ డిమాండ్‌ మెరుగుపడింది.  

డిస్కమ్‌లకు నష్టాలు!
2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 5% నుంచి 6% వరకూ క్షీణతలోనే ఉండే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. ఇది విద్యుత్‌ పంపిణీ కంపెనీల (డిస్కమ్స్‌) ఆదాయాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషించింది.  ముఖ్యం గా అధిక టారిఫ్‌లు చెల్లించే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి బల్క్‌ వినియోగ డిమాండ్‌ పడిపోవడాన్ని  ఇక్రా ప్రస్తావించింది.  ఈ పరిస్థితు ల్లో 2020–21లో డిస్కమ్‌లకు ఆదాయ వ్యత్యాసం అఖిల భారత స్థాయిలో రూ.42,000–45,000 కోట్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement