సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు తగినట్లుగా భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేయకపోతే అకస్మాత్తుగా తలెత్తే దుష్పరిణామాలు అంధకారంలో ముంచేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ప్రణాళిక (ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్)ను రూపొందించాయి. రానున్న పదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో చోటుచేసుకునే మార్పులను అంచనా వేశాయి.
పెట్టుబడులు ఎంత పెట్టాలనే దానిపై లెక్కలుగట్టాయి. దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో), ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇచ్చిన ఈ నివేదికలపై శనివారం ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపట్టనుంది.
నిజానికి.. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యలయంలో జరిగే ఈ విచారణ ఈసారి విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరగనుంది. కొత్త కార్యాలయం ఏర్పాటైన మరుసటిరోజే తొలి బహిరంగ విచారణ జరుగుతుండటం విశేషం. ఈ విచారణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికపై ఏపీఈఆర్‌సీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఎంత అవసరం..
ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు 2024–25 నుంచి 2028–29 వరకూ 5వ కంట్రోల్ పీరియడ్‌కు, 2029–30 నుంచి 2033–34 వరకూ 6వ కంట్రోల్ పీరియడ్‌కు వివిధ అంశాలపై సమగ్ర అంచనా నివేదికలను రూపొందించాయి. వీటి ప్రకారం.. ప్రస్తుతం సోలార్ రూఫ్‌టాప్ సిస్టం సామర్థ్యం రాష్ట్రంలో 150.152 మెగావాట్లుగా ఉంది. ఇది 2034 నాటికి 661.88 మెగావాట్లకు పెరుగుతుంది. అలాగే, విద్యుత్ వాహనాలు ప్రస్తుతం 68,975 ఉన్నాయి. వీటి సంఖ్య 2034 నాటికి 10,56,617కు చేరుతుంది.
ఇవి ప్రస్తుతం 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడుతుండగా, పదేళ్లకు 677 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇక గృహ విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఏడాదికి 17,330 మిలియన్ యూనిట్లు ఉంది. 2034 నాటికి ఇది 31,374 మిలియన్ యూనిట్లకు పెరగనుంది. అన్ని కేటగిరీలకూ కలిపి ప్రస్తుతం 65,228 మిలియన్ యూనిట్లు ఉండగా, 2034కు 1,30,899 మిలియన్ యూనిట్లు అవసరమవుతుంది. సాంకేతిక, పంపిణీ నష్టాలు పోనూ 1,45,331 మిలియన్ యూనిట్లు ఉంటే తప్ప అందరి అవసరాలు తీరవు.
విద్యుత్ ఎలా వస్తుందంటే..
రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్‌కో)కు 3,410 మెగావాట్ల థర్మల్, 1,774 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవికాక..
♦ విజయవాడ వీటీపీఎస్‌లో 5వ యూనిట్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
♦ లోయర్ సీలేరులో 230 మెగావాట్లు, పోలవరంలో 560 మెగావాట్ల 1 నుంచి 7 యూనిట్లు 2024–25లో, 8 నుంచి 12 యూనిట్లలో 400 మెగావాట్లు 2025–26లో, అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ 1 నుంచి 8 యూనిట్లలో 1,200 మెగావాట్లు 2027–28లో, ఇక్కడే 150 మెగావాట్ల 9వ యూనిట్ 2028–29లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశముంది.
♦ మొత్తంగా ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యం 5,184 మెగావాట్లుకు అదనంగా 3,340 మెగావాట్ల సామర్థ్యం ఏపీ జెన్‌కో ద్వారా తోడవ్వనుంది.
♦ ఇవికాక.. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్, ఇండిపెండెంట్ పవర్ జనరేటర్లు, సౌర, పవన విద్యుత్ వస్తుంది.
♦ వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3 వేల మెగావాట్లు, 2026లో మరో 3 వేల మెగావాట్లు, 2027లో 1000 మెగావాట్లు చొప్పున మొత్తం 7 వేల మెగావాట్లు రానుంది.
♦ ఈ విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మించనున్నారు.
♦ ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు 10 నుంచి 2029 నాటికి 71కి పెరగనున్నాయి. లైన్లు కూడా 969.15 సర్క్యూట్ కిలోమీటర్లు నుంచి 4,837.16 సీకేఎంకు విస్తరించనున్నాయి.
♦ ఈ మొత్తం ట్రాన్స్‌మిషన్ కోసం రూ.15,729.41 కోట్లు వ్యయం కానుంది.
♦ ఇదికాక మౌలిక సదుపాయాల కల్పన, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటికి మరింతగా ఖర్చుచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment