ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో దేశీ కార్పొరేట్ల నిర్వహణ లాభ మార్జిన్లు మందగించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఇందుకు ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కారణంకానున్నట్లు పేర్కొంది. వెరసి అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో వార్షిక ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 2.37 శాతం క్షీణించి 16.3 శాతానికి పరిమితంకానున్నాయి.
అయితే త్రైమాసికవారీగా అంటే జులై–సెప్టెంబర్(క్యూ2)తో పోల్చి చూస్తే 1.8 శాతం బలపడనున్నట్లు ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం, పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం దోహదపడనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా ముడివ్యయాలు నీరసించడంతోపాటు.. ఉత్పత్తుల విక్రయ ధరలు మెరుగుపడటంతో సమీప కాలంలో మార్జిన్లు బలపడనున్నట్లు వివరించింది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గుల కారణంగా రిస్కులు ఎదురుకావచ్చని పేర్కొంది.
ఫైనాన్షియల్ మినహా..
ఫైనాన్షియల్ రంగ సంస్థలు మినహా ఇతర కంపెనీల ఆదాయం 17.2 శాతం పుంజుకోనున్నట్లు ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, చమురు గ్యాస్, ఆటో, ఎయిర్‌లైన్స్, విద్యుత్ రంగాలు ఆదాయ వృద్ధిలో ముందు నిలవనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా మాత్రం ఆదాయంలో 1.4 శాతమే వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కన్జూమర్ సెంటిమెంట్లు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. ఇంధన వ్యయాల ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులు, ఎగుమతి, దిగుమతి కంపెనీలపై విదేశీ మారక ఆటుపోట్లు వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశీ కార్పొరేట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఇక్రా నిపుణులు శ్రుతి థామస్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment