Domestic corporate company
-
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: దేశీయ కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్ సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించవచ్చు.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సాంకేతిక నిపుణులు నాగరాజ్ శెట్టి తెలిపారు. గతవారం స్టాక్ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, డీమార్ట్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, ఏసియన్ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితో పాటు జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, ఏంజెల్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ హావెల్స్, ఎల్అండ్టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, పాలీక్యాబ్ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్ బ్యాంక్, ఆర్బీఎల్, యస్ బ్యాంక్ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూన్ హోల్‌సేల్ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్ రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, జూన్ అమెరికా రిటైల్ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. గురువారం బ్రిటన్ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్ జూన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా, యూరోజోన్ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూన్ 12తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్ జూన్ రిటైల్ అమ్మకాల డేటా, జపాన్ జూన్ ద్రవ్యోల్బణం, యూరోజోన్ మే కరెంట్ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులువిదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.బడ్జెట్‌పై ఆంచనాలు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు. మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు -
మార్కెట్ నుంచి రూ.9.5 లక్షల కోట్లు - ప్రైమ్‌డేటాబేస్ రిపోర్ట్
ముంబై: దేశీ కార్పొరేట్ సంస్థలు గతేడాది (2023) మార్కెట్ నుంచి రూ. 9.58 లక్షల కోట్ల నిధులు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 26 శాతం అధికం. అప్పట్లో కార్పొరేట్ బాండ్ల ద్వారా కంపెనీలు రూ. 7.58 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌డేటాబేస్ క్రోడీకరించిన గణాంకాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో 863 సంస్థలు బాండ్లను జారీ చేయగా 2023లో ఈ సంఖ్య 920కి పెరిగింది. రుణాలకు డిమాండ్ పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీపరంగా సవాళ్లు నెలకొనడంతో మార్కెట్ బాట పట్టే కార్పొరేట్ల సంఖ్య పెరిగిందని ప్రైమ్‌డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా తెలిపారు. గతేడాది ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అత్యధికంగా రూ. 4.72 లక్షల కోట్లు సమీకరించాయి. 2022లో నమోదైన రూ. 3.66 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ఇక ప్రైవేట్ రంగం నిధుల సేకరణ రూ. 3.18 లక్షల కోట్ల నుంచి 40 శాతం పెరిగి రూ. 4.45 లక్షల కోట్లకు చేరినట్లు హల్దియా చెప్పారు. మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 41 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2022లో ఇది 38 శాతమేనని వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. 2023లో మార్కెట్ నుంచి అత్యధికంగా నిధులు సమీకరించిన సంస్థల్లో హెచ్డీఎఫ్సీ (రూ. 74,062 కోట్లు), నాబార్డ్ (రూ. 63,164 కోట్లు), పీఎఫ్సీ (రూ. 52,575 కోట్లు), ఆర్ఈసీ (రూ. 51,354 కోట్లు), ఎస్బీఐ (రూ. 51,080 కోట్లు) ఉన్నాయి. ఈ ఐదు సంస్థలు కలిసి మొత్తం రూ. 2.92 లక్షల కోట్లు సేకరించాయి (గతేడాది మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 31 శాతం). 2022లో టాప్ 5 ఇష్యూయర్లు రూ. 1.96,276 కోట్లు సేకరించాయి (ఆ ఏడాది కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 26 శాతం). రూ. 5.61 లక్షల కోట్ల మొత్తానికి (దాదాపు 59 శాతం) కూపన్ రేటు 7–8 శాతంగా ఉండగా, 16 శాతం నిధులకు (రూ. 1.55 లక్షల కోట్లు) 8–9 శాతం శ్రేణిలో ఉంది. 2023లో 404 సంస్థలు తొలిసారి మార్కెట్ నుంచి సమీకరించాయి. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 408గా నమోదైంది. పబ్లిక్ బాండ్ల ఇష్యూలు 175 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు 44 ఇష్యూల ద్వారా రూ. 18,176 కోట్లు సమీకరించాయి. 2022లో 29 ఇష్యూల ద్వారా రూ. 6,611 కోట్లు సమీకరించాయి. దేశీ కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి రూ. 3.29 లక్షల కోట్లు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 4 శాతం అధికం. -
ప్రపంచ పరిణామాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ప్రపంచ పరిణామాలు, దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టబడుల సరళీపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ఈ కొత్త ఏడాది 2024 తొలి వారంలో జరిగిన అయిదు ట్రేడింగ్ సెషన్లలో సూచీలు మూడింటిలో లాభాలు ఆర్జించగా, రెండింటిలో నష్టాలు చవిచూశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 214 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయాయి. ‘‘దేశీయ కార్పొరేట్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన నేపథ్యంలో మార్కెట్ పరిమిత శ్రేణి ట్రేడవుతూ, ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. స్థిరమైన ర్యాలీ కొనసాగితే అమ్మకం, అనూహ్యంగా పతనమైతే నాణ్యమైన షేర్ల కొనుగోళ్లు వ్యూహాన్ని అమలు చేయడం ఉత్తమం. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొని ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 21,750 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 22,000 స్థాయిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 21,600 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఫలితాల సీజన్ ప్రారంభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మూడో త్రైమాసిక కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్ ఈ వారం ప్రారంభం కానుంది. దేశీయ ఐటీ అగ్రగామి సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు గురువారం( జనవరి 11న) ఆర్థిక ఫలితాలను ప్రకటించి దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. మరుసటి రోజు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆనంద్ రాఠి, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ పనితీరును వెల్లడించనున్నాయి. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా స్టాక్ ఆధారిత ట్రేడింగ్ జరగొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ నవంబర్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక సేవల గణాంకాలు సోమవారం విడుదల అవుతాయి. జపాన్ నవంబర్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ నవంబర్ నిరుద్యోగ రేటు, అమెరికా నవంబర్ వాణిజ్య లోటు గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. అమెరికా నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా గురువారం ప్రకటించనుంది. ఇక వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ నవంబర్ రిటైల్, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదే రోజున జనవరి 5తో ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు, డిసెంబర్ 29తో ముగిసిన వారం బ్యాంకింగ్ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు విడుదల కానున్నాయి. కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. ప్రపంచ పరిణామాలు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులతో ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది. అమెరికా బాండ్లపై రాబడులు గతవారం రోజుల్లో 18 బేసిస్ పాయింట్లు పెరిగి 4 శాతానికి పైగా చేరుకున్నాయి. యూఎస్ డిసెంబర్ పేరోల్ డేటా అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు. 5 ట్రేడింగ్ సెషన్లల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు కొత్త ఏడాది తొలివారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐలు జనవరి 1–5 తేదీల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారతీయ బలమైన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డెట్ మార్కెట్లో అదనంగా మరో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ డేటా వెల్లడించింది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో (జనవరి 1–5 తేదీల్లో) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.7,296 కోట్ల ఈక్విటీలు విక్రయించారు. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. డెట్ మార్కెట్లో రూ.68,663 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
క్యూ3లో మార్జిన్ల నేలచూపు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో దేశీ కార్పొరేట్ల నిర్వహణ లాభ మార్జిన్లు మందగించనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. ఇందుకు ద్రవ్యోల్బణం, ఇంధన వ్యయాలు కారణంకానున్నట్లు పేర్కొంది. వెరసి అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో వార్షిక ప్రాతిపదికన ఇబిటా మార్జిన్లు 2.37 శాతం క్షీణించి 16.3 శాతానికి పరిమితంకానున్నాయి. అయితే త్రైమాసికవారీగా అంటే జులై–సెప్టెంబర్(క్యూ2)తో పోల్చి చూస్తే 1.8 శాతం బలపడనున్నట్లు ఇక్రా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం, పలు కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం దోహదపడనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా ముడివ్యయాలు నీరసించడంతోపాటు.. ఉత్పత్తుల విక్రయ ధరలు మెరుగుపడటంతో సమీప కాలంలో మార్జిన్లు బలపడనున్నట్లు వివరించింది. అయితే భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ఆర్థిక మాంద్య భయాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గుల కారణంగా రిస్కులు ఎదురుకావచ్చని పేర్కొంది. ఫైనాన్షియల్ మినహా.. ఫైనాన్షియల్ రంగ సంస్థలు మినహా ఇతర కంపెనీల ఆదాయం 17.2 శాతం పుంజుకోనున్నట్లు ఇక్రా అంచనా వేసింది. హోటళ్లు, చమురు గ్యాస్, ఆటో, ఎయిర్‌లైన్స్, విద్యుత్ రంగాలు ఆదాయ వృద్ధిలో ముందు నిలవనున్నట్లు తెలియజేసింది. త్రైమాసికవారీగా మాత్రం ఆదాయంలో 1.4 శాతమే వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడింది. ఇందుకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కన్జూమర్ సెంటిమెంట్లు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. ఇంధన వ్యయాల ద్రవ్యోల్బణం, అభివృద్ధి చెందిన దేశాలలో మాంద్య పరిస్థితులు, ఎగుమతి, దిగుమతి కంపెనీలపై విదేశీ మారక ఆటుపోట్లు వంటి అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశీ కార్పొరేట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఇక్రా నిపుణులు శ్రుతి థామస్ తెలియజేశారు. -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
పెరిగిన ఎస్బీఐ అడ్వాన్స్ టాక్స్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి దేశీ కార్పొరేట్ సంస్థల ముందస్తు పన్ను చెల్లింపులు అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. క్యూ3 ముందస్తు పన్ను చెల్లింపుల గడువు సోమవారం(16న) ముగిసింది. సంబంధిత వర్గాల వివరాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 1,425 కోట్లను చెల్లించింది. గతేడాది(2013-14) ఇదే క్వార్టర్లో రూ. 1,130 కోట్లను మాత్రమే చెల్లించింది. ఈ బాటలో గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ 13% అధికంగా రూ. 735 కోట్ల పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో రూ. 650 కోట్లను చెల్లించింది. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తాజాగా రూ. 135 కోట్ల పన్ను కట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ముంబై నుంచి రూ. 2.30 లక్షల కోట్లు ఈ ఏడాదికి పెట్టుకున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 7.36 లక్షల కోట్లుకాగా, వీటిలో దేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబై నుంచి రూ. 2.30 లక్షల కోట్లు లభించగలవని ఆదాయ పన్ను శాఖ భావిస్తోంది. కాగా, ఈ ఏడాది తొలి అర్థభాగంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 7% మాత్రమే పెరిగి రూ. 2.68 లక్షల కోట్లకు చేరాయి. లక్ష్యంగా పెట్టుకున్న 17% వృద్ధితో పోలిస్తే ఈ గణాంకాలు నిరుత్సాహం కలిగించేవే. ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో లాభాలు ఆర్జించే కార్పొరేట్లు, వ్యక్తులు దఫదఫాలుగా చెల్లించే పన్నునే ముందస్తు పన్ను చెల్లింపులుగా పేర్కొంటారు. సాధారణంగా రెండో క్వార్టర్లో కంపెనీలు 30% పన్నును ముందస్తుగా చెల్లిస్తాయి. కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు వాటి పనితీరును తెలియజేస్తాయని ఒక అంచనా.