ముంబై: దేశీ కార్పొరేట్ సంస్థలు గతేడాది (2023) మార్కెట్ నుంచి రూ. 9.58 లక్షల కోట్ల నిధులు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 26 శాతం అధికం. అప్పట్లో కార్పొరేట్ బాండ్ల ద్వారా కంపెనీలు రూ. 7.58 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌డేటాబేస్ క్రోడీకరించిన గణాంకాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో 863 సంస్థలు బాండ్లను జారీ చేయగా 2023లో ఈ సంఖ్య 920కి పెరిగింది.
రుణాలకు డిమాండ్ పెరగడం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీపరంగా సవాళ్లు నెలకొనడంతో మార్కెట్ బాట పట్టే కార్పొరేట్ల సంఖ్య పెరిగిందని ప్రైమ్‌డేటాబేస్ ఎండీ ప్రణవ్ హల్దియా తెలిపారు. గతేడాది ఆర్థిక సంస్థలు, బ్యాంకులు అత్యధికంగా రూ. 4.72 లక్షల కోట్లు సమీకరించాయి.
2022లో నమోదైన రూ. 3.66 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ఇక ప్రైవేట్ రంగం నిధుల సేకరణ రూ. 3.18 లక్షల కోట్ల నుంచి 40 శాతం పెరిగి రూ. 4.45 లక్షల కోట్లకు చేరినట్లు హల్దియా చెప్పారు. మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా 41 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2022లో ఇది 38 శాతమేనని వివరించారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
- 2023లో మార్కెట్ నుంచి అత్యధికంగా నిధులు సమీకరించిన సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ (రూ. 74,062 కోట్లు), నాబార్డ్ (రూ. 63,164 కోట్లు), పీఎఫ్‌సీ (రూ. 52,575 కోట్లు), ఆర్‌ఈసీ (రూ. 51,354 కోట్లు), ఎస్‌బీఐ (రూ. 51,080 కోట్లు) ఉన్నాయి. ఈ ఐదు సంస్థలు కలిసి మొత్తం రూ. 2.92 లక్షల కోట్లు సేకరించాయి (గతేడాది మార్కెట్ల నుంచి కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 31 శాతం). 2022లో టాప్ 5 ఇష్యూయర్లు రూ. 1.96,276 కోట్లు సేకరించాయి (ఆ ఏడాది కార్పొరేట్లు సమీకరించిన మొత్తం నిధుల్లో 26 శాతం).
- రూ. 5.61 లక్షల కోట్ల మొత్తానికి (దాదాపు 59 శాతం) కూపన్ రేటు 7–8 శాతంగా ఉండగా, 16 శాతం నిధులకు (రూ. 1.55 లక్షల కోట్లు) 8–9 శాతం శ్రేణిలో ఉంది.
- 2023లో 404 సంస్థలు తొలిసారి మార్కెట్ నుంచి సమీకరించాయి. అంతక్రితం ఏడాది ఈ సంఖ్య 408గా నమోదైంది.
- పబ్లిక్ బాండ్ల ఇష్యూలు 175 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు 44 ఇష్యూల ద్వారా రూ. 18,176 కోట్లు సమీకరించాయి. 2022లో 29 ఇష్యూల ద్వారా రూ. 6,611 కోట్లు సమీకరించాయి.
- దేశీ కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి రూ. 3.29 లక్షల కోట్లు సమీకరించాయి. 2022తో పోలిస్తే ఇది 4 శాతం అధికం.
Comments
Please login to add a commentAdd a comment