
భారత ఆర్థిక పరిస్థితిపై పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం చర్యలకు సూచిస్తున్నాయి. మే 31 వ తేదీన 2018–19 (ఏప్రిల్–మార్చి) ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు విడుదల కానుండడం దీనికి నేపథ్యం. వచ్చే ఒకటి, రెండు నెలల్లో కేంద్రం 2019–2020 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడమూ ఇక్కడ ప్రస్తావనార్హం. 16వ లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని, ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో వెలువడిన వివిధ సంస్థల నివేదికలను చూస్తే....
తగ్గిన కంపెనీ ఆదాయాలు: ఇక్రా
కంపెనీల ఆదాయాలు జనవరి–మార్చి (2018–19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం)లో భారీగా పడిపోయాయి. ఈ కాలంలో కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి కేవలం 10.7 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఆరు త్రైమాసికాల్లో (18 నెలలు) ఇంత తక్కువ స్థాయి కార్పొరేట్ ఆదాయాల వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... కార్పొరేట్ నిర్వహణా పరమైన లాభాలు స్వల్పంగా 0.78 శాతం పడిపోయి, 16.8 శాతానికి చేరాయి. 304 లిస్టెడ్ సంస్థల ఫలితాల ప్రాతిపదికన ఇక్రా తాజా విశ్లేషణ చేసింది. ఒక్క వినియోగ సంబంధ కంపెనీలను చూస్తే, వృద్ధి లేకపోగా –2.3 శాతం క్షీణత నమోదయ్యింది. పాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు అంత ఆశాజనకంగా లేవు.
భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి. 2017–18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016–17లో 4.6 శాతం, 2015–16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి.
వృద్ధి 6.9 శాతమే: ఇండ్–రా అంచనా
కాగా 2018–19లో భారత్ ఆర్థిక వృద్ధి కేవలం 6.9 శాతంగానే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనావేసింది. ఇది కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా 7 శాతంకన్నా తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మందగమన పరిస్థితులను అధిగమించడానికి మధ్య కాలిక తక్షణ చర్యలు అవసరమని సూచించింది. 2017–18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. ఇక ప్రత్యేకించి నాల్గవ త్రైమాసికం జనవరి–మార్చి కాలాన్ని చేస్తే, జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గుతుందని అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రెసెర్చ్ వెలువరించింది. ఆర్థిక మందగమన పరిస్థితులను అధిగమించడం కేంద్రం ముందున్న తక్షణ సవాలని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు తగిన విధంగా లేనప్పటికీ, విధాన, ద్రవ్య పరమైన దేశీయ చర్యల ద్వారా పరిస్థితులను కొంత అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది.
వ్యవసాయానికి ప్రాధాన్యత: ఐసీఐసీఐ బ్యాంక్
కేంద్రం తక్షణం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్ తన తాజా పరిశోధనా నివేదికలో పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం, బ్యాంకింగ్ నుంచే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి కూడా వ్యవసాయ రంగానికి సకాలంలో రుణ సదుపాయం అందేలా చూడ్డం వంటి చర్యలు అవసరమని సూచించింది.
ప్యాకేజీ ప్రకటించాలి : ఫిక్కీ
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, బలహీనపడుతున్న దేశీయ డిమాండ్ నేపథ్యంతో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించాల్సిన అవసరం ఉందని బడ్జెట్ ముందస్తు బడ్జెట్ మెమోరాండంలో ఫిక్కీ పేర్కొంది. ముఖ్యంగా ద్రవ్యపరమైన ఉద్దీపన చర్యల ప్యాకేజ్‌ని ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2018–19 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ తన మెమోరాండంను విడుదల చూస్తూ, ‘‘భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. ఆయా అంశాలు ఆందోళన కూడా కల్గిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే, పెట్టుబడుల్లో వృద్ధి జోరు తగ్గింది. ఎగుమతులూ ఆశాజనకంగా లేవు. వినియోగ డిమాండ్‌లోనూ బలహీనతే కనిపిస్తోంది’’ అని ఫిక్కీ పేర్కొంది.
ఆయా సవాళ్ల పరిష్కారంపై కేంద్రం తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసింది. తగిన ద్రవ్య, విధానపరమైన చర్యల ద్వారా వినియోగం, పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని, 2019–2020 బడ్జెట్ ఇందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పిస్తుందని ఫిక్కీ పేర్కొంది. వృద్ధికి ఊపును అందించడంలో భాగంగా తొలుత కార్పొరేట్ పన్నులను 25 శాతానికి తగ్గించాలని, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (మ్యాట్)ను రద్దు చేయాలని కోరింది. చిన్న పరిశ్రమల పురోగతికి ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇండస్ట్రీ చాంబర్ ప్రతినిధి బృందం ఒకటి రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేతో సమావేశమై తన బడ్జెట్ ముందస్తు మెమోరాండంను సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment