న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రికవరీ ఇంకా విస్తృత స్థాయిలో లేదని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో మార్చితో ముగిసే 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంటుందన్న తమ గత ఏడాది జూన్ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్‌పై బ్యాంక్ తాజా నివేదికలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
- కాంటాక్ట్ ఇంటెన్సెవ్ సేవల పునరుద్ధరణ నుంచి ఎకానమీ ప్రయోజనం పొందాలి. ఎకానమీకి ద్రవ్య, విధానపరమైన మద్దతు పూర్తిస్థాయిలో లభించడం కొంత కష్టం.
- 2022-23లో వృద్ధి 8.7 శాతం, 2023-24లో 6.8 శాతం వృద్ధి నమోదుకావచ్చు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి తయారీ, మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం ప్రయోజనాలు, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాలు తాజా అంచనాలకు కారణం.
- దక్షిణాసియాలో కరోనా సవాళ్లకు తోడు వినియోగ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ బ్యాంకుల లక్ష్యాలకన్నా ఇది తీవ్రంగా పెరుగుతోంది.
- ప్రపంచ ఆర్థిక వృద్ధి 2021లో 5.5 శాతంగా ఉంటే, 2022లో 4.1 శాతానికి పెరిగే వీలుంది. అయితే 2023లో వృద్ధి 3.2 శాతంగా ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సరళతర ఆర్థిక విధానాలు వెనక్కు తీసుకోవడం, డిమాండ్ వ్యత్యాసాలు దీనికి ప్రధాన కారణం.
యూబీఎస్ అంచనాలు 9.1 శాతానికి కోత
మరోవైపు భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాలను స్విస్ బ్రోకరేజ్ దిగ్గజం-యూబీఎస్ సెక్యూరిటీస్ 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో అంచనాలు 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గాయి. మార్చి త్రైమాసికంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం దీనికి ప్రధాన కారణమని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఒమిక్రాన్ ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. దీనితో 2022-23 వృద్ధి అంచనాలను 7.7 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. 2022-23లో భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రపంచ దేశాల్లోనే వేగంగా ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుత రుణ వృద్ధి రేటు తీరు (దాదాపు 7 శాతం) పట్ల ఆందోళన వ్యక్తం చేసిన యూబీఎస్, ఈ రేటు 2022-23లో 10 శాతానికి పెరుగుతుందని అంచనావేసింది. ఇక ద్రవ్యోల్బణం 2022-23లో 5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022–23 ఏప్రిల్ తర్వాత ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనావేసింది. అమెరికా ఫెడ్ ఫండ్‌రేటు పెంపు, ఫారిన్ నిధులు వెనక్కు వెళ్లడం, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ తప్పడం, చమురు ధర 100 డాలర్లకు పెరిగే అవకాశం వంటి అంశాల నేపథ్యంలో 2022లో రూపాయి మారకపు విలువ 78కి పడిపోయే వీలుందని అభిప్రాయడింది.
మరికొన్ని అంచనాలు ఇలా..
ఎకానమీపై కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8-5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం.
గత ఆర్థిక సంవత్సరం (2020-21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021-22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్‌బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.3 నుంచి 9.5 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి.
(చదవండి: కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!)
Comments
Please login to add a commentAdd a comment