ముంబై: ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలో.. భారత కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలను కోల్పోయినా.. తమ లాభాలను మాత్రం తెలివిగా కాపాడుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు/క్యూ1)లో కంపెనీల ఆదాయాలు ఏకంగా 31 శాతం మేర పడిపోగా.. అదే సమయంలో లాభాల క్షీణత 3.6 శాతానికే పరిమితమైనట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఓ నివేదికలో తెలియజేసింది. 489 కంపెనీల క్యూ1 ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఇక్రా ఈ వివరాలను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది.
మొదటి రెండు నెలలు (ఏప్రిల్, మే) దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడమే కారణంగా పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడం వల్ల జూన్ త్రైమాసికానికి ముందు వరుసగా మూడు త్రైమాసికాల్లోనూ కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. జూన్ త్రైమాసికంలో మాదిరి భారీ క్షీణతను ఎప్పుడూ చూడలేదని ఇక్రా స్పష్టం చేసింది. ‘‘తయారీ, పారిశ్రామిక, నిర్మాణ, వినియోగ కార్యకలాపాలపై క్యూ1లో ఎక్కువ భాగం నియంత్రణలు కొనసాగాయి. ఇదే ప్రధానంగా కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించింది’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు.
నివేదికలోని అంశాలు..: వినియోగ ఆధారిత రంగాలలో ఆదాయాల క్షీణత ఎక్కువగా ఉంది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 జూన్ క్వార్టర్‌లో ఆదాయాలు సగం మేర పడిపోయాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో, కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల వినియోగదారులు ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. విచక్షణారహిత వినియోగం కిందకు వచ్చే ఎయిర్‌లైన్స్, హోటళ్లు, రిటైల్, ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడింది. అదే ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ గూడ్స్ విభాగాలపై తక్కువ ప్రభావం పడింది. పన్నుకు ముందస్తు మార్జిన్లు క్యూ1లో 3.6 శాతానికి పరిమితమయ్యాయి. అంతక్రితం మార్చి త్రైమాసికంలో మార్జిన్లు 4.3 శాతంగా ఉన్నాయి. మార్జిన్లు ఎక్కువగా ప్రభావితమైన వాటిల్లో ఎయిర్ లైన్స్, హోటళ్లు, రిటైల్, హెల్త్ కేర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ రంగాలున్నాయి. చారిత్రక కనిష్టాలకు పడిపోయిన మార్జిన్లు ప్రస్తుత త్రైమమాసికం నుంచి క్రమంగా మెరుగుపడతాయి.
ఆదాయాలు క్షీణించినా.. లాభాలు స్థిరమే
Published Mon, Sep 7 2020 4:28 AM | Last Updated on Mon, Sep 7 2020 4:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment