న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు లిస్టెడ్ విమానయాన సంస్థలకు రేటింగ్‌పరమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్ సంస్థల రుణాలను వివిధ రేటింగ్ సంస్థలు అక్టోబర్‌లో కుదించాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) పొందిన దాదాపు రూ. 8,000 కోట్ల విలువ చేసే బ్యాంక్ ఫెసిలిటీస్ దీర్ఘకాలిక రేటింగ్‌ను అక్టోబర్ 17న ఇక్రా కుదించింది. స్వల్పకాలిక రేటింగ్‌ను యథాతథంగానే కొనసాగించింది.
అటు నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఇటు వాటిని తట్టుకునేందుకు విమాన చార్జీలను పెంచలేని పరిస్థితి ఉండటం వంటివి ఇండిగో సహా ఎయిర్‌లైన్స్ రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఇక్రా పేర్కొంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్ రుణాల దీర్ఘకాలిక రేటింగ్‌ను కూడా ఇక్రా డౌన్‌గ్రేడ్ చేసింది. నిధుల సమీకరణలో జాప్యాలు కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయని పేర్కొంది.
మరోవైపు, మధ్యకాలికంగా నిర్వహణ పనితీరుపై ఒత్తిళ్లు కొనసాగుతాయనే కారణంతో స్పైస్‌జెట్ బ్యాంక్ ఫెసిలిటీస్ రేటింగ్స్‌ను అక్టోబర్ 9న క్రిసిల్ డౌన్‌గ్రేడ్ చేసింది. 2018 మార్చి ఆఖరు నాటికి స్పైస్‌జెట్ వద్ద రూ. 248 కోట్ల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోవడం, విమాన ఇంధనం ధరలు (ఏటీఎఫ్) 34% ఎగియడం వంటివి ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడానికి కారణమయ్యాయని ఇక్రా వివరించింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 40% ఏటీఎఫ్‌దే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment