ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమూ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1,049 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు క్షీణించి 76,250, నిఫ్టీ 384 పాయింట్లు పతనమై 23,047 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ద్రవ్యల్బోణం పెరగొచ్చనే ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
అధిక వాల్యుయేషన్లు, వృద్ధిపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 4.17%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3,562 కంపెనీల షేర్లలో 2,876 షేర్లు నష్టపోగా, 508 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకింది. సూచీల వారీగా బీఎస్‌ఈ రియల్టీ ఇండెక్స్ 6.50% అత్యధికంగా పతనమైంది. యుటిలిటీ 4.50%, సర్వీసెస్ 4.35% చొప్పున పడ్డాయి.
4 రోజుల్లో 24.7 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా నాలుగు రోజుల్లో రూ.24.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.417.05 లక్షల కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది.
అమెరికా డిసెంబర్ వ్యవసాయేతర ఉద్యోగాలు (2.56 లక్షలు) అంచనాలను మించాయి. నిరుద్యోగ రేటు 4.2% నుంచి 4.1 శాతానికి దిగివచ్చింది. అధిక ఉద్యోగాల నియామకంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు తలెత్తాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనలు మెదలయ్యాయి. బాండ్లపై రాబడులు 14 ఏళ్ల గరిష్టం 4.79% భారీగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఈక్విటీల్లోంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.
భారత్, చైనాకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.5% పెరిగి 81.67 స్థాయికి చేరింది. తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకొనే భారత్‌కు అధిక ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగించాల్సి వస్తుంది.
ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని కేంద్రం ముందస్తు అంచనా వేసింది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు 2024–25 ఏడాది కార్పొరేట్ ఆదాయాలు ఒక అంకె వృద్ధికే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. కార్పొరేటు ఆదాయాలు, జీడీపీ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి.
Comments
Please login to add a commentAdd a comment