దేశంలో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం ఇది. దేశ రాజధాని న్యూఢిల్లీకి సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ చేపట్టిన రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లోని మొత్తం 1,113 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు మూడు రోజుల్లోనే అమ్ముడైపోయాయి. అది కూడా నిర్మాణం ప్రారంభం కాకముందే..
శాటిలైట్ సిటీలో..
దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ (DLF Ltd.) గురుగ్రామ్‌లోని 1,113 విలాసవంతమైన నివాసాలను కేవలం మూడు రోజుల్లో విక్రయించింది. ఇందులో పావు వంతు ఇళ్లను ప్రవాస భారతీయులు కొనడం విశేషం. డీఎల్‌ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్ట్‌లోని ఏడు టవర్‌లలో అన్ని నాలుగు-పడక గదుల ఫ్లాట్‌లు, పెంట్‌హౌస్ యూనిట్లు అమ్ముడయ్యాయని డీఎల్‌ఎఫ్ తమ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. గూగుల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన శాటిలైట్ సిటీలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ విస్తరించి ఉంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలతో విలాసవంతమైన కార్ల నుంచి ఖరీదైన నివాసాల వరకు గణనీయంగా అమ్మడవుతున్నాయి. ప్రీమియం అపార్ట్‌మెంట్‌లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు బిల్డర్‌లను ప్రేరేపిస్తోంది.
గతేడాదిలోనూ..
కాగా గత సంవత్సరంలోనూ డీఎల్‌ఎఫ్ ఇదేవిధంగా కేవలం మూడు రోజుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన 1,100 అపార్ట్‌మెంట్‌లను విక్రయించింది. మరొక అగ్ర డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఢిల్లీ సమీపంలోని ప్రాజెక్ట్‌లలో సుమారు రూ.5వేల కోట్ల విలువైన విలాసవంతమైన నివాసాలను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment