4, 7, 10 తేదీల్లో మంచి ముహూర్తాలు
7న వేలాదిగా పెళ్లిళ్లు
డిసెంబర్ 25 వరకూ శుభ కార్యక్రమాలు
సాక్షి, అమలాపురం: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తోంది. బ్రహ్మచారులు కొత్త బంధంలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కన్నెపిల్లలు సిగ్గుల మొగ్గలవుతూ ముస్తాబులకు రెడీ అవుతున్నారు. పెళ్లి ఏర్పాట్లకు వధూవరుల కుటుంబాలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి.
నగలు, వస్త్రాలు, కల్యాణ మండపాలు, సన్నాయి, కేటరింగ్‌కు డిమాండ్ ఏర్పడింది. నగలు, వస్త్ర దుకాణాల్లో అప్పుడే షాపింగ్ కళ పెరిగిపోయింది. పెళ్లి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైంది. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆచితూచి శుభఘడియలను ఎంచుకుని ముడేస్తారు. తద్వారా వారి వివాహ బంధం జీవితకాలం ఎలాంటి ఆటుపోట్లకు లోనవకుండా ఉండాలని కోరుకుంటారు.
మార్గశిరం మంచిదని..
మార్గశిర (డిసెంబర్) మాసంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ మాసంతో పాటు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. మార్గశిర మాసంలో బలమైన ముహూర్తాలు ఉండటంతో పాటు జనవరిలో పుష్యమాసం కావడం.. మార్చి రెండో వారం నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) రానుండటంతో ఇప్పుడున్న ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయాలని పెద్దలు ఆరాటపడుతున్నారు.
ప్రస్తుత కార్తీక మాసంలో ఈ నెల 24న చివరి ముహూర్తం ఉంది. కార్తీకంలో పెళ్లిళ్లు జరిగినా పెద్దగా లేవనే చెప్పాలి. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం మొదలు కానుండటంతో వివాహాలు అధిక సంఖ్యలో జరగనున్నాయి. తెలుగునాట మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల తరువాత మార్గశిర మాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతుంటాయి.
జనవరిలో ముహూర్తాలు లేవు
డిసెంబర్ 25 తరువాత నుంచి జనవరి 30వ తేదీ వరకూ పుష్యమాసంలో వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాలు పెద్దగా చేయరు. జనవరి 31 నుంచి మార్చి 7వ తేదీ వరకూ మాఘమాసంలో ముహూర్తాలున్నాయి. మార్చి 13 నుంచి శుక్ర మౌఢ్యమి (మూఢం) మొదలు కానుండటంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులకు పైగా ఎదురుచూపులు తప్పవు. ఈ కారణాలతో మార్చి 7లోపు పెళ్లిళ్లు చేసేందుకు చాలామంది ఆరాటపడుతున్నారు.
7న అతి పెద్ద ముహూర్తం
డిసెంబర్ నెల పొడవునా ముహూర్తాలున్నాయి. ఆ నెలలో ఏడో తేదీ అతి పెద్ద ముహూర్తం. ఆ రోజున సుమారు 30 పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం సైతం పెద్దఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. జనవరిలో పుష్యమాసం కావడంతో పెద్దగా ముహూర్తాలు లేవు. ఈ కారణంగా డిసెంబర్‌లో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. – దైవజ్ఞరత్న ఉపద్రష్ట నాగాదిత్య సిద్ధాంతి, అమలాపురం
25 వరకూ శుభముహూర్తాలు
మార్గశిర మాసంలో డిసెంబర్ 4వ తేదీ బుధవారం బలమైన ముహూర్తాలున్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 7.54 గంటలకు, తెల్లవారుజామున 4.28 గంటలకు (తెల్లవారితే గురువారం), అలాగే 5, 6 తేదీల్లో ముహూర్తాలున్నాయి. 7వ తేదీన కూడా అతి పెద్ద ముహూర్తాలున్నాయి.
ఆ రోజు రాత్రి 7.50, తెల్లవారుజామున 4.24 (8వ తేదీ ఉదయం) రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి. అలాగే, 10వ తేదీన సైతం అధిక సంఖ్యలో వివాహాలు చేయనున్నారు. డిసెంబర్ 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో పెళ్లిళ్లతో పాటు, వివిధ శుభ కార్యక్రమాలకు సైతం మంచి ముహూర్తాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment