ఇక ముహూర్తాల్లేవ్‌! | No Marriage Dates Till May 2021 | Sakshi
Sakshi News home page

ఇక ముహూర్తాల్లేవ్‌!

Published Sat, Jan 9 2021 9:28 AM | Last Updated on Sat, Jan 9 2021 10:08 AM

No Marriage Dates Till May 2021 - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయని పండితులు తేల్చి చెబుతున్నారు. దీంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు అడ్డంకి అవు తోందని, దీంతో శుక్రవారం వరకే పెళ్లి ముహూర్తా లు ముగిశాయని, ఇక ఈ ఏడాది మే నెల వరకూ మంచి రోజులు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు.  

మే 14 తర్వాతే.. 
ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు ఉండవు. అంటే సుమారు నెల రోజుల పాటు గురుమౌఢ్యమి ఉంటుందని పండితులు తెలిపారు. ఇక ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత శుభదినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు బలమైన ముహూర్తాల్లేవని అంటున్నారు. మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజులు మాత్రమే. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని పండితులు అంటున్నారు. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజులలో పెళ్లిళ్లకి అంత మంచి రోజులైతే కాదని చెబుతున్నారు.   

నిరుడు కరోనా కాటు...ఇప్పుడు ముహూర్తాల లోటు 
పెళ్లి ముహూర్తాలు లేకపోవడంతో ఇటు పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు, అటు తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. అసలే గతేడాదంతా కరోనా సమస్యలతో శుభకార్యాలు తక్కువగా జరిగాయి. ఈ ఏడాదైనా కాస్త వెసులుబాటు వస్తుందని భావిస్తే..ముహూర్తాలు దెబ్బతీశాయని వారంటున్నారు. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు, అర్చకులు, పూలు, పండ్ల వ్యాపారులకు కూడా ఇది నష్టం కలిగించే అంశమే. 

ముహూర్తాలు తక్కువే.. 
ఈ ఏడాది తెలుగు మాసాల్లో ఒక మాసం అధికంగా వచ్చింది. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు చేయరు. నిజ మాసంలో..అది కూడా బలమైన ముహూర్తం ఉంటేనే శుభకార్యాలు నిర్వహస్తారు. ఇంగ్లీషు సంవత్సరం ప్రకారం ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు ఐదు నెలల వరకు మంచి రోజులు లేవు, మిగిలిన రోజుల్లో కూడా బలమైన ముహూర్తాలు ఎక్కువగా లేవు.  
–బాచిమంచి చంద్రమౌళి, సిద్ధాంతి    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement