చెన్నేకొత్తపల్లి మండలం పెనుబోలు గ్రామానికి చెందిన పోతలయ్య మోతుబరి రైతు. తన కుమార్తె పావని వివాహం ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 1, 2 తేదీల్లో చేయాలని నిర్ణయించాడు. బంధువులందరినీ పిలిచి ఘనంగా చేయాలని భావించాడు. కానీ కరోనా పరిస్థితుల్లో విధిలేక 20 మంది బంధువుల సమక్షంలో కల్యాణం జరిపించాల్సి వస్తోంది.
ఇక నగరానికి చెందిన శివశంకర్ రెడ్డి లాయర్. తన కుమారుని వివాహం భారీగా చేయాలని భావించినప్పటికీ కరోనా కేసుల కలకలంతో ప్రభుత్వ సూచనలకు లోబడి తక్కువ మందితోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ఆర్భాటంగా పిల్లల పెళ్లిళ్లు జరిపించాలని భావించినా కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచన మేరకు అతితక్కువ మంది సమక్షంలో కానిచ్చేస్తున్నారు.
అనంతపురం: ఇన్నిరోజులూ పెళ్లి చేయాలంటే కనీసం నాలుగు నెలల ముందు నుంచే ఏర్పాట్లలో మునిగిపోయేవారు. పెళ్లి పత్రికలు మొదలుకుని వేదిక, డెకరేషన్, వంటకాలు, ఆర్కెస్ట్రా, బంధుమిత్రుల కలయిక ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో ఆర్భాటం చేసేవారు. ఖర్చు విషయంలో వెనుకాడేవారు కాదు. అయితే ప్రస్తుతం కరోనా పుణ్యమా అని పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 20 మంది సమక్షంలోనే పెళ్లి తంతును పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పెళ్లిళ్ల సీజన్ షురూ...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా గుంపులు కలవలాంటే జనం జంకుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా మార్చి 22 నుంచి లాక్‌డౌన్ అమలులో ఉన్నా కొద్ది రోజుల తర్వాత నిబంధనల్లో కాస్తా సడలింపులిచ్చారు. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడేవారి సంఖ్య క్రమేనా పెరుగుతుండటంతో కంటోన్‌మెంట్ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు. గుంపులుగా కలిస్తే కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంటుందనే ఆలోచనతో శుభ కార్యాలయాల నిర్వహణ విషయంలో నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 21 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం అంటేనే పెళ్లిళ్లకు పేరు. ఈ నెల 22 నుంచి వచ్చేనెల 16 వరకు బలమైన ముహూర్తాలున్నాయి. మంచిముహూర్తాలు ఉండడంతో చాలామంది పెళ్లిళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కరోనా టెస్టు తప్పనిసరి
♦ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. వరుడు, వధువు ఇద్దరి తరుఫున ఈ సంఖ్యకు మించకూడదనే నిబంధనను విధిస్తున్నారు.
♦ మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ల వద్దే దీని కోసం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
♦ పెళ్లి కార్యక్రమం పెట్టుకున్న వారు అనుమతి కోసం రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫడవిట్ తహసీల్దార్‌కు అందజేయాలి.
♦ దరఖాస్తుదారులు తమ ఆధార్‌కార్డులతో పాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్య ధ్రువీకరణపత్రం తప్పకుండా జత చేయాలి.
♦ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 188 సెక్షన్ మేరకు చర్యలు తీసుకుంటారు.
తగ్గనున్న ఖర్చులు
ఫంక్షన్ హాలు, లైటింగ్, భోజనాలు, డెకరేషన్ తదితర వాటికి గతంలో ఖర్చు తడిసి మోపడయ్యేది. కరోనా పుణ్యమా అని ఈ ఖర్చులు భారీగా తగ్గిపోతున్నాయి. ఐదు నెలల కింద వరకు వీటి ఖర్చు కోసం రూ.లక్షలు ఖర్చు చేసేవారు. ఇప్పుడు వేల రూపాయలలోనే పెళ్లిళ్లు పూర్తి కానున్నాయి. పరిమితికి మించి అనుమతులు ఇవ్వకపోవడంతో ఆర్భాటాలకు వెళ్లే అవసరం ఉండదు. కరోనా భయంతో ఎంత సాదాసీదాగా చేసుకుంటే అంత మంచిదనే అభిప్రాయం సంపన్న వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇక ఖర్చు విషయంలో మధ్య, పేద తరగతి వర్గాలకు చాలా వరకు ఉపశమనం కల్గినట్లే.
నిబంధనలకు లోబడే పెళ్లిళ్లు
శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. చాలా మంది పెళ్లిళ్లు చేసేందుకు ముహూర్తాలు కట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో పరిమితికి లోబడే హాజరయ్యేలా చూడాలని వధువు, వరుడు బంధువులకు చెబుతున్నాం. నిబంధనలకు అనుగుణంగానే పెళ్లిళ్లు చేసేందుకు వారంతా సానుకూలంగా ఉన్నారు.– భూపతి శివ కుమార్ శర్మ, పురోహితులు, కొడవండ్లపల్లి ముదిగుబ్బ
Comments
Please login to add a commentAdd a comment