మాఘం...శుభ ముహూర్తాల మాసం. అందుకే అందరూ ఈ మాసం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండగా.. జిల్లాలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణ మంటపాల వద్ద సందడి కనిపిస్తోంది.
హిందూపురం అర్బన్: వివాహం... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులైతే మంచి ముహూర్తంలో మూడుముళ్లు వేయించాలని భావిస్తుంటారు. అందుకోసం అవసరమైతే నెలల తరబడి వేచి చూస్తుంటారు. మిగతా మాసాలు ఎలా ఉన్నా మాఘమాసం మాత్రం మంచి ముహూర్తాలను మోసుకువస్తుంది. అందుకే అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ నెల 11 నుంచి క్రోదనామ సంవత్సర చైత్రమాసం వరకు (ఏప్రిల్ 26) మూడు నెలల పాటు 30 మాత్రమే వివాహ ముహూర్తాలున్నాయి. తర్వాత శ్రావణ మాసం(ఆగస్టు)లోనే తిరిగి వివాహాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
అన్నింటికీ డిమాండ్..
ఈ మాఘ మాసంలో జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ మేరకు ఆయా కుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 13న మంచి ముహూర్తం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా భారీగా స్థాయిలో వివాహాలు జరగనున్నాయి. సుమారు రెండు నెలల తరువాత మంచి ముహూర్తాలు వస్తుండటంతో ఇప్పటికే కల్యాణ మంటపాలన్నీ ఫుల్ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల వద్ద పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇక బంగారం, దుస్తుల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. పురోహితులు, కేటరింగ్, సన్నాయి మేళం, డెకరేషన్స్, సప్లయర్స్‌కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా హిందూపురం, కదిరి, ధర్మవరం ఇలా ప్రధాన పట్టణాలతో పాటు, అక్కడి దేవాలయాల ప్రాంగణాల్లో ఎక్కువ పెళ్లిల్లు జరగనున్నాయి.
వివాహ సముహూర్తాలు ఇవే..
మాఘమాసం : ఫిబ్రవరి 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి నెల 2, 3 తేదీలు.
పాల్గుణం: మార్చి 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీలు, ఏప్రిల్ 3, 4 తేదీలు.
చైత్రం: ఏప్రిల్ 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీలు.
ఏప్రిల్ వరకూ ముహూర్తాలు
ఫిబ్రవరి 2 ఆదివారం మొదలు మంచి ముహూర్తాలు. కానీ మాఘమాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. మాఘమాసం ప్రారంభం నుంచి ఏప్రిల్ 26 వరకు మంచి ముహూర్తాలున్నాయి. అవి దాటితే మళ్లీ ఆగస్టులోనే. ఉపనయనాలు, వివాహాలు, గృహ ప్రవేశాలకు ఇదే మంచి తరుణం.
– సునీల్‌శర్మ, పండితులు, హిందూపురం.
Comments
Please login to add a commentAdd a comment