
క్వింటా ఎండుమిర్చి రూ.14 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర తగ్గింది. శుక్రవారం హిందూపురం మార్కెట్‌లో క్వింటా గరిష్టంగా రూ.14 వేలు మాత్రమే పలికింది. మార్కెట్‌కు 47.70 క్వింటాళ్ల మిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండు మిర్చి గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.12,600 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌కు వచ్చే సరుకు బాగా తగ్గుతున్నట్లు ఆయన వెల్లడించారు.
జీవీఎస్ పాఠశాల ఘటనపై అధికారుల విచారణ
ధర్మవరం: పట్టణంలోని జీవీఎస్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టిన ఘటనపై శుక్రవారం ఎంఈఓలు రాజేశ్వరిదేవి, గోపాల్‌నాయక్ విచారణ చేపట్టారు. పాఠశాలకు వెళ్లిన వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాన్ని విచారించారు. అనంతరం ఎంఈఓలు విలేకరులతో మాట్లాడారు. జీవీఎస్ పాఠశాలలో గతంలో జరిగిన ఘటనలు, తాజాగా విద్యార్థులను చెప్పుతో కొట్టిన ఘటనపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా విద్యాశాఖాధికారికి పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను కొట్టడం, తిట్టడం, లైంగిక వేధింపులకు గురిచేయడం విద్యా హక్కు చట్టం ప్రకారం నేరమన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎంఈఓలు హెచ్చరించారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
పనిచేస్తాయి
ప్రశాంతి నిలయం: నేడు రెండో శనివారం అయినప్పటికీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కార్యాలయాలు పనిచేస్తాయని జిల్లా రిజిస్టార్ కృష్టకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పని చేస్తాయన్నారు. ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
బడుగుల ఆశాజ్యోతి
జ్యోతిరావు పూలే
● జయంతి వేడుకల్లో కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావ్ పూలే ఆయా వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని కలెక్టర్ టీఎస్ చేతన్ కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీమహల్‌లో జ్యోతిరావ్ పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమాధికారి నిర్మలాజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ టీఎస్ చేతన్ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమానత్వం కోసం, సామాజిక వివక్షపై పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్‌పూలే అన్నారు. విద్యా వికాసంతోనే వివక్ష నిర్మూలన సాధ్యమని నమ్మిన గొప్ప వ్యక్తి జ్యోతిరావ్ పూలే అన్నారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఎల్‌డీఎం రమణమూర్తి, కురుబ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, వాల్మీకి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులుతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో వేడుకలు..
మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంత వేడుకలు శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి కలెక్టర్ చేతన్, పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రత్న పూలే చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు.

క్వింటా ఎండుమిర్చి రూ.14 వేలు