
అక్రమ కేసులతో భయపెట్టలేరు
● వేణురెడ్డిపై పోలీసులది
ముమ్మాటికీ కక్ష సాధింపే
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
పెనుకొండ రూరల్: అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. పోలీసులు ఎంతగా వేధించినా వెనక్కుతగ్గేది లేదని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. మంగళవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. హిందూపురం పోలీసులు ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తల చేతులకు బేడీలు వేసి ఉగ్రవాదుల్లా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం దుర్మార్గమన్నారు. దీనిపై ప్రశ్నించినందుకే గుడ్డంపల్లి వేణురెడ్డిపై పోలీసులు కక్షగట్టారన్నారు. శాంతియుత నిరసన తెలియజేసే హక్కునూ కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పార్టీల నేతలతో పాటు పోలీసులూ గమనించాలన్నారు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే భవిష్యత్‌లో తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్ట్‌లతో వైఎస్సార్ సీపీ శ్రేణుల గొంతు నొక్కలేరని గుర్తుంచుకోవాలన్నారు.
జిల్లాకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 40.2 నుంచి 41.3 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు.