సాక్షి, అమరావతి బ్యూరో: పుత్తడి ధర అందనంతగా పరుగులు తీస్తోంది. బంగారం రోజురోజుకూ ప్రియమవుతోంది. పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైన తరుణంలో పసిడి ధరలు ప్రియం కావడం శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు భారంగా మారుతోంది. విజయవాడలో జనవరి రెండో వారంలో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50 వేల లోపు, 22 క్యారెట్ల ధర రూ.46 వేల వరకు ఉంది. ప్రస్తుతం విజయవాడ, విశాఖలో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ.50,470 ఉంది. అంటే మూడు నెలల్లో 10 గ్రాములపై రూ.4,200 నుంచి 4,500కిపైగా పెరిగింది. బంగారం మరింత ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇంట్లో వివాహ వేడుకలకు కనీసం నాలుగైదు తులాల (45–55 గ్రాముల) బంగారాన్ని కొనుగోలు చేస్తాయి.
పెరుగుతున్న కొనుగోళ్లు..
పసిడి ధర అమాంతం పెరుగుతున్నప్పటికీ శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు కొనుగోలు చేయక తప్పడం లేదు. పెళ్లిళ్ల సీజను మొదలు కావడం, బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న ప్రచారంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మూడు నాలుగు నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం బంగారం అమ్మకాలు బాగున్నాయని విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన జ్యుయలరీ షాపు యజమాని నరేంద్ర ‘సాక్షి’కి తెలిపారు.
కారణాలివీ..
ఆభరణాల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ డివైస్‌ల తయారీలోనూ బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఉత్పత్తి రంగాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్‌ల తయారీ కూడా ఊపందుకుంటోంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, బంగారంపై పెట్టుబడులు సురక్షితమనే ఉద్దేశం, బ్యాంకుల వడ్డీ రేట్లు క్షీణించడం, షేర్ మార్కెట్లలో అనిశ్చితి.. వెరసి పసిడి ధరల పెరుగుదలకు ప్రత్యక్ష, పరోక్షంగా దోహదం చేస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్తకులు విశ్లేషిస్తున్నారు.
Gold Prices In Wedding Season: గోల్డ్ రష్
Published Wed, Apr 13 2022 4:09 AM | Last Updated on Wed, Apr 13 2022 11:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment