
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ కుప్పకూలాయి. రూపాయి పతనం దేశీయ స్టాక్ మార్కెట్లను అంతకంతకు పాతాళంలోకి పడేసింది. ఉదయం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి భారీగా పతనం కావడంతో, మార్కెట్లు సైతం ఆరంభంలోనే భారీగా క్షీణించాయి. ఇక అప్పుడు మొదలైన పతనం, ఇక ఎక్కడా ఆగకుండా... కిందకి పడుతూనే ఉన్నాయి. కనీసం ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ భారీగా క్రాష్ అయి ఒక్కరోజే 900 పాయింట్ల మేర ఢమాలమంది. చివరికి సైతం 806 పాయింట్లు పతనమై, 35,169 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం సెన్సెక్స్ బాటలోనే నష్టాల్లో కొట్టుమిట్టాడింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా 259 పాయింట్లు నష్టపోయి 10,600 కింద 10,599 వద్ద స్థిరపడింది. ఒక్కరోజే దేశీయ స్టాక్‌సూచీలు 1.50 శాతానికి పైగా నష్టపోవడం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టించింది.
తీవ్ర అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఈ విధంగా కుప్పకూలాయి. ఓ వైపు రూపాయి పాతాళంలోకి జారిపోవడం, మరోవైపు క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడం ఇన్వెస్టర్లలో భయాందోళనలు పెరిగాయి. అటు ఆసియన్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. చాలా వరకు ఆసియా మార్కెట్లు, క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకునేవే ఉన్నాయి. దీంతో క్రూడాయిల్ ఎఫెక్ట్ ఆయా మార్కెట్లపై కూడా చూపించింది. ఈ నేపథ్యంలో డాలర్ పుంజుకుని, ఆసియన్ మార్కెట్ల కరెన్సీని మరింత పడగొట్టింది. మన దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 73.82ను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి రూపాయి విలువ కొంత కోలుకుని 36 పైసల నష్టంలో 73.70 వద్ద కొనసాగుతోంది. క్రూడాయిల్ ధరలు పతనం, రూపాయి క్షీణించడంతో, ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
నేడు పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2.50 తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఈ ప్రకటనతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, ఓఎన్‌జీసీ, రిలయన్స్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఆయిల్ కంపెనీల షేర్లు 22 శాతం నుంచి 18 శాతం మధ్య క్షీణించగా... ఓఎన్‌జీసీ పది శాతం కిందకి పడింది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు అండగా నిలిచిన ఫార్మా, ఐటీ షేర్లు ఇవాళ భారీగా క్షీణించాయి. ఈ రెండు రంగాల సూచీలు 3 శాతం తగ్గాయి. పీఎస్‌యూ బ్యాంకుల సూచీ మాత్రం పటిష్ఠంగా ఉండి.. నామ మాత్రపు నష్టాలతో ముగిసింది. ఇవాళ లాభాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్‌ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment