ముంబై : దలాల్ స్ట్రీట్ మరోసారి కుప్పకూలింది. చివరి గంట ట్రేడింగ్‌లో పూర్తిగా బేర్స్ ఆధిపత్యం చెలాయించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 550 పాయింట్లు క్రాష్ అయి, 36వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు నష్టపోయి తన కీలక మైన మార్క్ 10,850 దిగువకూ దిగజారింది. క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, ఇటలీ బడ్జెట్ ప్లాన్, రూపీ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోవడం, అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. చివరి గంటల్లో అమ్మకాల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్ షేర్లు మార్కెట్లను భారీగా కుప్పకూల్చాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల్లోనే ఉన్నాయి. కేవలం మెటల్స్ మాత్రమే లాభాలు ఆర్జించాయి.
మార్కెట్ అవర్స్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్లు నష్టపోయి 35,975 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 10,858 వద్ద క్లోజయ్యాయి. మొట్టమొదటిసారి డాలర్ మారకంలో రూపాయి విలువ 73 మార్కు దిగువకు క్షీణించి, 73.42 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కో బ్యారల్‌కు 85 డాలర్లను మించిపోవడంతో, రూపీ ఇలా భారీగా క్షీణించింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఈ విధంగా పడిపోవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఏప్రిల్ నుంచి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 20 శాతానికి పైగా ఎగిశాయి. దీంతో రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు. అయితే మార్కెట్ ముగిసే సమయంలో రూపాయి విలువ భారీగా రికవరీ అయింది. 73.42 మార్కును తాకిన రూపాయి 40 పైసలకు పైగా రికవరీ అయింది. అయినప్పటికీ మార్కెట్లు మాత్రం కోలుకోలేదు.
శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్, రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్‌మెంట్, ముథూట్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, జుబిలియంట్ ఫుడ్‌వర్క్స్, గోద్రెజ్ కన్జ్యూమర్, డాబర్, జీఎస్‌కే కన్జ్యూమర్, బాటా ఇండియా, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, అపోలో టైర్స్ 3 శాతం నుంచి 10 శాతం వరకు క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ 85 డాలర్లను మించిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment