నిమర్జనం జాగ్రత్త | ganesh immersion ceremony | Sakshi
Sakshi News home page

నిమర్జనం జాగ్రత్త

Published Fri, Sep 5 2014 2:09 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

నిమర్జనం జాగ్రత్త - Sakshi

నిమర్జనం జాగ్రత్త

జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జనం భక్తి పారవశ్యంతో ఆదిదేవున్ని కొలుస్తున్నారు. మరికొన్నిచోట్ల మాలధారణలు, కంకణధారణలు స్వీకరించి తమదైన రీతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల పర్యావరణ పరిరక్షణ కు మట్టి వినాయకులను ప్రతిష్టించి ప్రత్యేకత చాటుకుంటున్నారు. మంటపాల్లో నిర్వాహకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఉత్సవాలతో పాటే ప్రమాదాలూ పొంచి ఉన్నాయనే విషయాన్ని మరవొద్దు. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న నవరాత్రులను అంతే ఆనందంతో ముగించుకోవాల్సిన అవసరం ఉంది. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అశుభ ఘడియలు చోటు చేసుకోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సంబురాలు విజయవంతం చేయొచ్చు.  - కరీంనగర్ క్రైం
నిమజ్జనోత్సవం విజయవంతం చేద్దాం..
కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం
మండళ్ల నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
వాహనాల చోదకులు ఇవి పాటించాలి
నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిమలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వస్తుంటారు. కాబట్టి ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు సూచనలివ్వాలి.
అనుభవజ్ఞులైన డ్రైవర్లనే ఎంచుకోవాలి.
డ్రైవర్‌కు ముందుగానే పోలీసులు, ఉత్సవ సమితి వారు సూచించిన సూచనలు, సలహాలను ఇవ్వాలి.
డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి.
మద్యం, మత్తు పానీయాలు, పదార్థాలకు దూరంగా ఉండాలి.
ముందు, వెనుక, పక్కభాగాలను పరిశీలిస్తూ డ్రైవింగ్ చేయాలి.
డ్రైవర్ పక్కన ఎవరినీ కూర్చోనివ్వద్దు. అలాగే వాహనం ముందు భాగంలో ఎవరినీ కూర్చోనివ్వకూడదు.
రోడ్లపై ఉండే గతుకులు, గుంతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వినాయక ప్రతిమకు తగిలే అవకాశం ఉంటే అవి వెళ్లే వరకు పూర్తి శ్రద్ధతో వాహనం నడిపి వాటిని తప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకాకూడదు.
ట్రాక్టర్ పైన ప్రతిమ వద్ద ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి.
డ్రైవర్‌ను సదరు నిర్వాహకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
 
కుటుంబీకులూ తమ వంతుగా...
శోభాయాత్ర, నిమజ్జన సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి.
నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపించకుండా, తెలిసిన వారితో గానీ, కుటుంబ సభ్యుల్లోని వారితో గానీ వెళ్లేలా చూసుకోవాలి.
ఎలాంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా చూసుకోవాలి. మత్తు పానీయాలు, పదార్థాలకు లోనుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి.
క్రమశిక్షణ, శాంతియుతంగా ఉండాలని ఆదేశించాలి.
శోభాయాత్ర తిలికించేందుకు చాలా మట్టుకు ప్రజలు డాబాల పైకి ఎక్కి తిలకిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ప్రహారి ఉన్న డాబాలపైకి ఎక్కి తిలకించాలి. అలాగే సమీపంలో విద్యుత్ తీగలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
 
సెట్టింగ్‌ల విషయంలో...
వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర భక్తి ప్రపత్తుల మధ్య జరుపుకోవాలి. ఇందులో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడం మేలు. ఒక బండి తర్వాత ఇంకో బండి వరుస క్రమంలో వెళ్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. తిలకించే భక్తులకూ సౌకర్యంగా ఉంటుంది.
శోభాయాత్రలో పూర్తిగా సంయమనం పాటించాలి.
ఎలాంటి ఉద్వేగాలకు పోకూడదు.
కేటాయించిన నెంబర్ల ప్రకారమే క్రమపద్ధతిలో వెళ్లాలి.
ఉత్సవ సమితి వారు, పోలీసులు సూచించినవిధి విధానాలు పాటించాలి. ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాలను భారీ సెట్టింగులతో వేసి వచ్చే భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపేందుకు చాలా చోట్ల ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికే చేశారు. మరికొన్ని చోట్ల సెట్టింగులు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే.. వేసే సెట్టింగుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి.
కరెంటు వైర్ల కింద నుంచి సెట్టింగులు ఉండ కుండా జాగ్రత్త పడాలి.
లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. తెగిపోవడం, జాయింట్లు వేయడం వంటివి లేకుండా చూసుకోవాలి.
సెట్టింగుల సమీపంలో బాణసంచాలు పేల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అగ్ని ప్రమాదాలు సంభవించే వాటిని సమీ పంలో ఉంచకుండా చూసుకోవాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాటిని ఆర్పేందుకు వీలుగా అవసరమైన నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచాలి.
ఆది దేవున్ని దర్శించుకునే భక్తులకు ప్రతిమ వద్దకు వెళ్లేందుకు వీలుగా పకడ్బందీగా మెట్లు, స్టేజీలను ఏర్పాటు చేయాలి.
దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఎలాంటి తోపులాటలు జరుగకుండా ఒకరి తర్వాత ఒకరు దర్శించుకు నేలా భారీ కేడ్లను ఏర్పాటు చేయాలి.
వర్షపు నీరు లోపలికి రాకుండా పైభాగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, మండపాల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.
రాకపోకలు సాగించే ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

 
నిమజ్జనం సమయంలో...

ప్రతిమలను ప్రవహించే నదులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, లోతైన వాటిల్లో నిమజ్జనం చేస్తారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నిమజ్జన సమయంలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే క్రెయిన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు.
సూచనలు, విధివిధానాలు తప్పక పాటించాలి.
పోలీసులు, నిమజ్జనం చేసే సదరు నిర్వాహకుల హెచ్చరికలు కాదని చెరువులు, నదులు, కుంటలు, ప్రాజెక్టుల నీటిలోకి వెళ్లేందుకు సాహసించకూడదు.
నీటి లోపలికి ఎవరూ వెళ్లకూడదు. అందులోనూ ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగకూడదు.
 
కరెంటు వైర్ల వద్ద జాగ్రత్త..
నిమజ్జన శోభాయాత్ర సమయంలో చాలా సందర్భాల్లో కరెంటు తీగలతో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి వాటి పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి.
కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను ముందుగానే విద్యుత్ శాఖ వారు సరిచేయాలి.
శోభాయాత్ర సమయంలో లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోవడం, జాయింట్లు ఉన్న వైర్లను వినియోగించ కూడదు.
జనరేటర్‌ను ప్రతిమ ఉన్న వాహనంలో ఉంచకుండా, దాని వెనుక భాగంలో ఒక వాహనంలో గానీ, ట్రాలీలో గానీ ఉండేలా చూసుకోవాలి. ముందు వాహనం కదిలిన సమయంలో వెనువెంటనే జనరేటర్ కదిలేలా అప్రమత్తంగా ఉండాలి.
విద్యుత్ తీగలు ప్రతిమకు తగిలే అవకాశం ఉందనిపిస్తే వెంటనే వాటిని పైకిలేపేందుకు ప్రత్యేక కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. వైర్లు దాటే వరకు అప్రమత్తంగా ఉండాలి.
శోభాయాత్రలో బాణసంచాలు, తదితర పేలుడు పదార్థాలు ఉపయోగించరాదు.
అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని నివారించేందుకు ప్రతిమ వెంట వాహనంలో అవసరమైనంత మేర నీళ్లు, ఇసుకను బకెట్‌లలో ఉంచుకోవాలి.
 
భక్తి పారవశ్యం చాటుదాం..
నిత్యం ఎంతటి భక్తితో ఆదిదేవున్ని కొలిచామో అదే మాదిరిగా నిమజ్జన శోభాయాత్రలోనూ ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరున్ని కొలవాలి.
భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ఇష్టారీతిన పారే యకుండా చేతికి అందివ్వాలి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో సామరస్యపూర్వక వాతావరణం కలిగేలా చూడాలి.
నిర్వాహకులు శాంతి, సామరస్యపూర్వకంగా ఉండాలి.
ప్రధానంగా ఊరేగింపు సమయంలో ఆధ్యాత్మిక చింతన ప్రజ్వరిల్లేలా దేశ సంస్కతి, సంప్రదాయాలను వెల్లివిరిసే భక్తి పాటలు, నృత్యాలు, కోలాటాలు తదితర వాటిని చేసుకుంటూ వెళ్లాలి.
తిలకించేందుకు వచ్చే చిన్నారులు, మహిళలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి.
మండపాల నిర్వాహకులు తమతో వచ్చే సభ్యులను తీసుకెళ్లడంతో పాటు వారిని తిరిగి ఇంటికే చేర్చే వరకు బాధ్యతగా వ్యవహరించాలి.
ఏదైనా చిన్న సంఘటన జరిగితే దానిని సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చూడాలి.
 
సమాచారం ఇవ్వండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement