పరిమితికి మించి శబ్ద కాలుష్యం
ఆంక్షలను పట్టించుకోనిమండప నిర్వాహకులు
కనిపించని పీసీబీ, మున్సిపల్, పోలీసుల తనిఖీలు
వినికిడి సమస్యలు తప్పవంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో వినాయకుడు మోత మోగించేశాడు. గణేష్ నిమజ్జనం వేళ డీజేలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్‌వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాలలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. పీసీబీ పరిమితులను గణేష్ మండప నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్ధరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా పీసీబీ, మున్సిపల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
👉గణేష్ ఊరేగింపుల్లో డీజేల చప్పుళ్లు, లౌడ్ స్పీకర్లు, జనరేటర్ల వినియోగం, టపాసులు కాల్చడం, వాహనాల హారన్లు, యువతీయువకులు బూరలతో శబ్దాలు చేయడం తదితర కారణాలతో నిమజ్జనం వేళ పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదైంది. ప్రధానంగా హుస్సేన్‌సాగర్, అబిడ్స్, బహదూర్‌పురా, చార్మినార్, ఖైరతాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. ఆయా ప్రాంతాల్లోని నివాసితులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వేరే రాష్ట్రాల్లో కేసులు..
పుణే, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో అధిక శబ్దాలను గుర్తించేందుకు పోలీసులు ప్రధాన రహదారుల్లో నాయిస్ డిటెక్షన్ ఉపకరణాలు ఏర్పాటు చేశారు. కానీ, వాటి నిర్వహణ లేక అలంకారప్రాయంగా మారాయి.
వినికిడి సమస్యలు..
మితిమీరిన శబ్దాలతో చిన్న పిల్లల కర్ణభేరి సూక్ష్మ నాడులు దెబ్బతింటాయి. వృద్ధులకు వినికిడి శక్తి లోపించే ప్రమాదం ఉంది. పరిమితికి మించి శబ్ధాలతో తలనొప్పి, చికాకు, గుండె స్పందనలో వేగం, రక్త ప్రసరణ పెరగడంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. 65 డెసిబుల్స్‌కు మించిన ధ్వనితో గుండె జబ్బులు, చెవుడు కూడా రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment